Train Accident: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలు దాటి ప్రాణాలు కోల్పోయిన యువకులు

ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం. ఈ సాంకేతిక ప్రపంచంలో సెల్‌ఫోన్‌లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. నిద్ర లేచిన దగ్గర్నుంచి.. నిద్రపోయే వరకు సెల్‌ఫోన్ మనం చేతిలోనే ఉంటుంది. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే అందరూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. కొందరు అయితే మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించలేనంతగా మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సెల్ ఫోన్.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న ఆ ఇద్దరూ రైలు ఢీకొని మృతి చెందారు. చెన్నైలోని స్థానిక సెయింట్ థామస్ మౌంట్‌లో ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం… పెరంబలూరుకు చెందిన మహమ్మద్ నపూల్ (20), సబీర్ అహ్మద్ (20)లు థామస్ మౌంట్ సమీపంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. థామస్ మౌంట్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఇద్దరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో ఎగ్మూరు నుంచి తాంబరం వైపు వెళ్తున్న సబర్బన్ రైలు దూసుకొచ్చింది. రైలు డ్రైవర్ ఎన్నిసార్లు హారన్ మోగించినా.. స్దానికులు కేకలు వేస్తున్నా యువకులు పట్టించుకోలేదు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలపైకి వచ్చేశారు. ఇద్దరినీ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు యువకుల మృతదేహాలను స్దానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మహమ్మద్ నపూల్, సబీర్ అహ్మద్ కలిసి ఆడంబాక్కంలోని ఒక హాస్టల్‌లో ఉన్నారు. ఇద్దరిలో ఒకరు కంప్యూటర్ సైన్స్. మరొకరు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం వారిద్దరూ సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడటానికి వెళ్లారు. రాత్రి ఇద్దరు హాస్టల్‌కు తిరిగి రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఈ ఘటన జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com