Maharashtra Hospital : 24గంటల్లోనే 24మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లోనే 12 మంది నవజాత శిశువులు, 24మంది రోగులు మరణించారు. మందులు, ఆసుపత్రి సిబ్బంది కొరత కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆసుపత్రి డీన్ చెప్పారు. గత 24 గంటల్లో మరణించిన 24 మందిలో, ఆరుగురు మగ. ఆరుగురు ఆడ శిశులుండగా.. 12 మంది పెద్దలు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువగా పాము కాటు వేసిన బాధితులే అని నాందేడ్ శంకర్రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్ తెలిపారు. ఆస్పత్రిలో వివిధ భాగాలకు సిబ్బందిని బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు.
"హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. మేము వారి నుంచి మందులు కొనాలి కానీ అది కూడా జరగలేదు. కానీ మేము స్థానికంగా మందులు కొనుగోలు చేసి రోగులకు అందించాం" అని డీన్ చెప్పారు. మందులు, నిధుల కొరత ఉందన్న డీన్ వాదనలను తోసిపుచ్చుతూ, ఆసుపత్రి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. "ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో రూ.12 కోట్ల నిధులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి , రూ.4 కోట్లు ఆమోదం పొందాయి. ఇతర రోగులు అవసరమైన విధంగా చికిత్స పొందుతున్నారు" అని ప్రకటనలో తెలిపింది.
మరణాలు దురదృష్టకరమని తెలిపిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏమి జరిగిందనే దానిపై మరింత సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరణాలపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com