MK Stalin: ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..

MK Stalin: ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..
బీజేపీలో రౌడీలే ఎక్కువంటూ విమర్శలు

తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల దాడి జరుగుతోంది. కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడులో శాంతిభద్రతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. దీనిపై తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రతిస్పందించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తరపున పోటీ చేస్తున్న అనేకమంది అభ్యర్థులు రౌడీలుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇందుకు సాక్ష్యం తన వద్ద జాబితా ఉందన్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదన్నారు. బీజేపీ పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందన్నారు. ఈ విషయంలో తమిళనాడు ప్రశాంతంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు సీఎం స్టాలిన్.

శనివారం సేలంలో జరిగిన ఎన్నికల సభకు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ పాలనలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావించారు. ఉత్తరాదిలో ఓటమి ఖాయమని భావించిన బీజేపీ.. దక్షిణాదిపై దృష్టి పెట్టిందన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ తరపున పోటీ చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సహా అనేక మంది నేతలు వెనుకాడుతున్నారని దుయ్యబట్టారు.

బీజేపీ నాటకాలు తమిళనాడులో ఏమాత్రం చెల్లవన్నారు సీఎం స్టాలిన్. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలు నానాకష్టాలు అనుభవించారని ఆరోపించారు. నియంత పాలన సాగిస్తున్న బీజేపీతో నిత్యం కష్టాలే ఎదురవుతాయన్నారు. అందుకే ఆ పార్టీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. తమిళనాడు ఎన్నటికీ పుణ్యభూమిగానే ఉంటుందన్నారు. అన్నాడీఎంకె.. బీజేపీని విమర్శించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. అలాగే బీజేపీ కూటమిలో ఉన్న పీఎంకెపైనా విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం స్టాలిన్.

సేలం డీఎంకే అభ్యర్థి టీఎం సెల్వగణపతి, కళ్లకురిచ్చి డీఎంకే అభ్యర్థి మలైయరసన్‌ల తరుపు సీఎం స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానిపై సీఎం ఎదురుదాడికి దిగారు. హిస్టరీ షీటర్లతో సహా నేరచరిత్ర కలిగిన 261 మంది నాయకులు బీజేపీలో ఉన్నారని స్టాలిన్ ఆరోపించారు. ఇలాంటి నాయకులు ఉన్న బీజేపీకి శాంతిభద్రతలపై వ్యాఖ్యానించే హక్కు లేదని ఆయన అన్నారు. బీజేపీలో ఉన్న హిస్టరీ షీటర్ల గురించి 32 పేజీల నివేదికను స్టాలిన్ చూపించారు. బీజేపీ నేతలపై మొత్తం 1977 కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story