Gujarat : గుజరాత్‌లో పిడుగుపాటుకు 27 మంది మృతి

Gujarat : గుజరాత్‌లో పిడుగుపాటుకు 27 మంది మృతి
వణికించి అకాల వర్షం , 71 పశువులు మృతి

ఈశాన్య రుతుపవనాలకు తోడు.. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న ఆవర్తనాలు, అల్పపీడనాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరి పంట కోతకు వచ్చిన సమయంలో కురుస్తోన్న అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 251 తాలూకాల్లోని 230 తాలూకాలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు పిడుగుపాటుతో 27 మంది మృతి చెందారు.

డౌడ్, భరూచ్, తాపి, అహ్మదాబాద్, అమ్రెల్లి, బనస్కాంత, బొతాద్, ఖేడా, మెహ్ సానా, పంచ్ మహల్, సబర్ కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకాలో అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిర్వహించిన డేటా ప్రకారం సోమవారం మధ్యాహ్నం నాటికి పిడుగుపాటుతో 71 జంతువులు కూడా చనిపోయాయి. భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

మొత్తం 254 తాలూకాల్లోని 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్టు తెలిపారు. సూరత్‌, సురేంద్రనగర్‌, ఖేడా, తాపి, భరూచ్‌లో 16 గంటల్లో రికార్డు స్థాయిలో 50-117 మి.మీ వర్ష పాతం నమోదైందని, రాజ్‌కోట్‌, మోర్బీ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లు వాన పడిందని పేర్కొన్నారు.


పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. పిడుగుపాటుకు దాహోద్‌ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు, అహ్మదాబాద్‌, అమ్రేలీ, సూరత్‌, సురేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో 11 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అకాల వర్షాలు పలువుర్ని బలితీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు.

‘గుజరాత్‌లోని వివిధ నగరాల్లో ప్రతికూల వాతావరణం, పిడుగుల కారణంగా చాలా మంది మరణించిన వార్త నన్ను చాలా కలచివేసింది.. ఈ విషాదంలో తమ ప్రియమైనవారిని కోల్పోయి బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేయాలి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

మంగళవారం కూడా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి బారీ వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. అటు రాజస్థాన్‌, మహారాష్ట్రలోనూ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుఫాను (Cyclone) ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది.



Tags

Read MoreRead Less
Next Story