Parliament: పార్లమెంట్ వద్ద హైటెన్షన్

Parliament: పార్లమెంట్ వద్ద హైటెన్షన్
X
నకిలీ ఆధార్ కార్డుతో లోనికి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తుల యత్నం

పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నకిలీ ఆధార్ కార్డుతో ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. గెట్ నెంబర్ 3 నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురిని భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. ఖాసిం, మోనిస్, షాయాబ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. కాగా వారు ఎందుకు అక్కడి వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇది ఉగ్రవాద కుట్రలో భాగంగా వీరు చొరబడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పార్లమెంటు భవనం సుందరీకరణ చర్యల్లో భాగంగా దాని ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ తదితరుల విగ్రహాలను తొలగించి, పాత భవనం సమీపంలోని లాన్‌లోకి మార్చారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ గురువారం తప్పుబట్టింది. పాత పార్లమెంటు భవనం, గ్రంథాలయం నడుమ ఉన్న లాన్‌లోని గిరిజన నేత బిర్సా ముండా, మహారాణా ప్రతాప్‌ తదితరుల విగ్రహాలు యథాస్థానంలో ఉన్నాయి. గాంధీ, అంబేడ్కర్, శివాజీల విగ్రహాల తరలింపును దారుణచర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు భాజపాను ఆదరించనందుకే పార్లమెంటు ఆవరణలోని శివాజీ, అంబేడ్కర్‌ విగ్రహాలను వాటి పూర్వస్థానం నుంచి తరలించారని కాంగ్రెస్‌ ప్రచార విభాగ అధిపతి పవన్‌ ఖేడా మండిపడ్డారు. గుజరాత్‌లోనూ భాజపా క్లీన్‌స్వీప్‌ ఆశలు వమ్ము కావడంతో మహాత్ముని విగ్రహం సైతం తొలగించారన్నారు. ‘‘ఒక్కసారి ఆలోచించండి. వీళ్లకు 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని వదిలేవారా?’’ అని ‘ఎక్స్‌’లో ఖేడా ప్రశ్నించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీఎంసీ ఎంపీ జవాహర్‌ సర్కార్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలె కూడా విగ్రహాల తరలింపును ఖండించారు.


అయితే పార్లమెంటు ఆవరణలోని విగ్రహాల తరలింపుపై విపక్షాల విమర్శల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ విగ్రహాలు వివిధ చోట్ల ఉండటం వల్ల సందర్శకులు వాటిని సరిగా చూడలేకపోతున్నారని పేర్కొంది. ఈ కారణంగానే వాటిని ‘ప్రేరణా స్థల్‌’లోకి మార్చి, ఆయా నేతల జీవిత చరిత్రలను కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

Tags

Next Story