Manipur : మణిపూర్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై సాయుధుల దాడి..

మణిపూర్‌లో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన విషయం తెలిసిందే. అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి తోబాల్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై దుండగులు దాడిచేశారు. దీంతో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి తోబాల్ జిల్లా ఖంగాబాక్ ప్రాంతంలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌పై కాంప్లెక్స్‌పై సామూహికంగా దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.
అనంతరం తోబాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి తెబడ్డారని, సాయుధులైన కొందరులు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ముగ్గురు బీఎస్‌ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ల గాయాలయ్యాయని చెప్పారు. వారిని ఇంఫాల్‌లోని దవాఖానకు తరలించామని వెల్లడించారు. బుధవారం సాయంత్రం తెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్‌పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేసిన ఈ దాడిలో ఇద్దరు పోలీస్ కమెండోలు మృతి చెందారు. దీంతో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ తాత్కాలిక పోస్ట్‌పై మిలిటెంట్లు బాంబులతో దాడి చేసి కాల్పులు జరపడమే కాక ఆర్పీజీ షెల్స్ ప్రయోగించారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
మరోవైపు బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను తుపాకులతో దారుణంగా కాల్చిచంపారు. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన ఐదారుగురు దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి పారిపోయారని చెప్పారు. మరో ఘటనలో కంగ్ పోక్సీ జిల్లాలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నుంచి ఇప్పటి వరకే మణిపుర్ లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పోలీసు కమాండోలతో సహా.. మొత్తం ఏడుగురు హత్యకు గురయ్యారు. మోరే జిల్లాలో ఇద్దరు పోలీసులను హత్య చేసిన ఘటనల్లో మయన్మార్ మిలిటెంట్ల హత్యం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com