TRAIN: పట్టాలు తప్పిన రైలు... నలుగురి మృతి

TRAIN: పట్టాలు తప్పిన రైలు... నలుగురి మృతి
X
పట్టాలు తప్పిన చండీగఢ్‌-డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు... కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చండీగఢ్‌-డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతిచెందగా.. దాదాపు 20 మందికి పైగా గాయపడినట్లు యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాథక్‌ తెలిపారు. రైలు బుధవారం రాత్రి చండీగఢ్‌ స్టేషన్‌ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 15 అంబులెన్స్‌లు, మెడికల్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ప్రమాదం గురించి తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా దీనిపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనీసం 13 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు.

దిబ్రూగఢ్-చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పట్టాలు తప్పిన ఘటనపై నార్త్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్వో పంకజ్ సింగ్ మాట్లాడుతూ...‘‘చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్లే రైలు మోతీగంజ్, జిలాయ్ మధ్య పట్టాలు తప్పింది. రైల్వే మెడికల్ వ్యాన్ అక్కడికి చేరుకుంది. సహాయక చర్యలు ప్రారంభించాం." అని వెల్లడించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, 4-5 కోచ్‌లు పట్టాలు తప్పాయి. వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించింది." అని పంకజ్ సింగ్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, బోగీల్లో ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి బస్సులతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు రెండు రైళ్లను కూడా దారి మళ్లించారు.



Tags

Next Story