Wolf attacks: ఉత్తర్‌ప్రదేశ్‌లో మనుషులపై తోడేళ్ల ప్రతీకారమా?

Wolf attacks: ఉత్తర్‌ప్రదేశ్‌లో మనుషులపై తోడేళ్ల ప్రతీకారమా?
30 ఏళ్ల తర్వాత మళ్లీ జనాలపై దాడులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా జనాలపై తోడేళ్ల గుంపు చేస్తున్న దాడులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 30యేళ్ల తర్వాత మళ్లీ అర్థరాత్రి గ్రామాలపైపడి చిన్న పిల్లలను చంపేస్తున్నాయి.1997 తర్వాత మళ్లీ యూపీలో తోడేళ్ల విజృంభన..గత కొన్ని వారాలుగా దాదాపు ఏడుగురు పిల్లలను చంపేశాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకుని బంధించగా.. ఇక మిగిలిన తోడేళ్లు కనిపిస్తే కాల్చి పారేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఈ తోడేళ్ల దాడులు పెరుగుతుండటం సంచలనంగా మారింది. ఇప్పటివరకు 10 మందిపై దాడి చేసి చంపేసిన తోడేళ్లు.. మరో పదుల సంఖ్యలో జనాలను గాయపరిచి ఆస్పత్రుల పాలు చేశాయి. తోడేళ్ల దాడులతో అక్కడి జనం బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. వ్యూహాలు మార్చుకుంటూ కొత్త కొత్త గ్రామాలపై దాడులు చేస్తుండటంతో వాటిని పట్టుకోవడం అటవీ అధికారుల వల్ల కావడం లేదు.

అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.

బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. సహజంగా తోడేళ్లు ఎప్పుడూ మనుషులపై దాడులు చేయవని.. 1980లో ఒకసారి, 1997లో మరోసారి గ్రామాలపై పడి దాడులు చేసినట్లు నిపుణులు వెల్లడించారు. అయితే ఆ సంఘటనలు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత మరోసారి ఇలా తోడేళ్లు మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు డాక్టర్ వైవీ ఝాలా వెల్లడించారు. అయితే బహ్రైచ్ జిల్లా ప్రజలు ఇప్పటికీ ఇళ్లకు తలుపులు లేకుండా అత్యంత కటిక పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు. ఆకలితో ఉన్న తోడేళ్లకు ఇదే అవకాశం కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags

Next Story