Chandipura Virus: గుజరాత్‌లో చాందీపురా కలవరం, మృతులు 32 మంది

ఉత్తరాదిన పలు రాష్ర్టాల్లో ‘చాందీపురా’ వైరస్ తీవ్ర కలకలం రేపుతున్నది. ఒక్క గుజరాత్‌లో ఈ వైరస్ బారినపడి 32మంది చనిపోయారని గుజరాత్ ఆరోగ్యమంత్రి రుషికేష్ పటేల్ ఆదివారం ప్రకటించారు. వైరస్ కేసులు 84కి చేరినట్టు చెప్పారు. సబరకాంత జిల్లాలో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వేరే రాష్ర్టాల నుంచి వచ్చిన ముగ్గురు వైరస్ బారినపడ్డారని, ఇతర రాష్ర్టాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో వైరస్ సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఏమిటీ వైరస్?
1965లో మహారాష్ట్రలోని చాందీపురాలో తొలిసారి ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. 15 ఏండ్లలోపు ఓ పిల్లాడు ఈ వైరస్‌తో చనిపోయాడు. దీంతో ఈ వైరస్‌కు ‘చాందీపురా’ అనే పేరు వచ్చింది. ఈగలు, కీటకాలు, దోమల నుంచి వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ఈడిస్ రకం దోమల నుంచి వ్యాప్తి చెందుతున్నదని వైద్య నిపుణులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ నుంచి గుజరాత్‌లో 15 లోపు పిల్లల్లో ‘అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్’ కేసులు నమోదయ్యాయి.
లక్షణాలు:
వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, విరేచనాలు ఉంటాయి. ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన మెదడు వాపు వ్యాధికి గురవుతారు. ముఖ్యంగా 9 నెలల నుంచి 15 ఏండ్ల లోపు పిల్లల్లో వైరస్ కారణంగా వస్తున్న జ్వరం ప్రాణాంతకంగా మారుతున్నది.
చికిత్స :
ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ఒక్కటే పరిష్కారం. దోమలు కుట్టకుండా ‘మాలథియాన్ పౌడర్’ను జల్లుకోవాలి. ముఖ్యంగా వైరస్‌తో జ్వరం వచ్చిన పిల్లలను వెంటనే వైద్యుల వద్దకు తీసుకుపోవాలి. ఐసొలేషన్‌లో రోగ లక్షణాలను అనుసరించి వైద్య చికిత్స అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com