Pen Theft: పెన్ను దొంగిలించాడని.. 3వ తరగతి విద్యార్థిని గదిలో పెట్టి కొట్టారు

Pen Theft: పెన్ను దొంగిలించాడని.. 3వ తరగతి విద్యార్థిని గదిలో పెట్టి  కొట్టారు
X
దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు

కర్ణాటకలోని రాయచూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. పెన్ను దొంగిలించాడని 3వ తరగతి విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరుణ్‌ కుమార్‌ అనే బాలుడు అన్న అరుణ్‌ కుమార్‌తో కలిసి రాయ్‌చూర్‌లోని రామకృష్ణ ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నాడు. తరుణ్‌ మూడో తరగతి కాగా, అరుణ్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే గత శనివారం విద్యార్థులంతా ఆడుకుంటుండగా.. తన పెన్నుపోయిందని, తరుణ్‌ దానిని దొంగతనం చేశాడని తోటి విద్యార్థి అతనిపై ఆశ్రమ ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వేణుగోపాల్‌.. తరుణ్‌ను ఓ గదిలో మూడు రోజులపాటు బంధించి విచక్షణారహితంగా కొట్టారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి అతని మొహం మొత్తం వాచిపోయింది. అయితే అతని తల్లి ఆదివారం తన పిల్లలను చూడటానికి రావడంతో జరిగిన విషయాన్ని అరుణ్‌ ఆమెకు వివరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. తరుణ్‌ను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, టీచర్‌తోపాటు మరో ఇద్దరు తనను కొట్టారని తరుణ్‌ చెప్పాడు. మొదట కట్టెతో కొట్టారని, అది విరిగిపోవడంతో బ్యాట్‌తో కొట్టి హింసించారని తెలిపాడు. వాటివల్ల తన శరీరం తెగిపోయిందని వెల్లడించాడు. యాద్గిర్‌ రైల్వే స్టేషన్‌లో భిక్షాటన కూడా చేయించారని, అయితే తనకు డబ్బు రాలేదని చెప్పాడు. ఇది ఒక్క పెన్ను గురించి జరిగిందని చెప్పి కన్నీరుపెట్టుకున్నాడు. వారు దెబ్బల ధాటికి తరుణ్‌ రెండు కళ్లు వాచిపోయాయి.

ఇద్దరు పిల్లలను చదివించడానికి తగిన స్థోమత లేకపోవడంతో ఆశ్రమంలో ఉంచామని తరుణ్‌ తల్లి తెలిపారు. తాను వారిని చూడటానికి వెళ్లినప్పుడు జరిగిందంతా పెద్ద కొడుకు చెప్పాడన్నారు. తరుణ్‌ ఏ పెన్నూ దొంగిలించలేదని, ఆడుకుంటుండగా కింద పడిఉన్న పెన్ను తీశాడని, తర్వాత అక్కడే పెట్టాడని చెప్పారు. శనివారం అతనివద్ద పెన్నులేకపోవడంతో మరో బాలుడు తరుణ్‌కి టీచర్‌ పెన్ను ఇచ్చాడని.. దానికి కోసం ఆ ఉపాధ్యాయుడు వెతకగా తరుణ్‌ బ్యాగులో దొరికిందని వెల్లడించారు. ఇదంతా ఆ పెన్ను గురించే జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆశ్రమ ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story