Uttara Pradesh: డబ్బులివ్వలేదని... రైలు బోగీలో పాములొదిలేశారు..!

Uttara Pradesh: డబ్బులివ్వలేదని... రైలు బోగీలో పాములొదిలేశారు..!
అరగంట పాటు గడగడలాడిపోయిన ప్రయాణికులు

ట్రైన్ లో ఓ బోగీలో ఉన్నవారికి సినిమా చూపించారు పాములు ఆడించేవారు. తమకు తగినన్ని డబ్బులు ఇవ్వలేదని వారిపైకి పాములను వదిలారు. చాలాసేపు భోగిలోని వారందరిని బిక్కు బిక్కుమంటూ బతికేలా చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణిస్తుంది చంబల్ ఎక్స్ ప్రెస్. సాధారణ ప్రయాణికులు ఎక్కినట్టే నలుగురు పాములాడించేవారు కూడా పాము బుట్టలు చేతపట్టుకుని ట్రైన్ బోగీలోకి ఎక్కారు. ట్రైన్ కదిలిన తర్వాత బుట్ట పై కప్పు తీసేశారు. అందులోని పాములు తలలు బయటకు పెట్టాయి. వారు పాములు ఆడించడం మొదలు పెట్టారు. కొద్దిసేపు ఈ ఆట సాగిన తర్వాత వారు ప్రయాణికుల నుంచి డబ్బుల కోసం అడిగారు. ఆటను చూసిన కొంతమంది ప్రయాణీకులు వారికి డబ్బులు ఇచ్చారు. మరికొంతమంది ఇవ్వలేదు. అయితే వారు వస్తాయనుకున్నన్ని డబ్బులు రాకపోవడంతో పాములు ఆడించేవారికి చిరెత్తుకొచ్చింది. బుట్టలో నుంచి పాములను తీసి బయటకు వదిలారు. ఆ పాములు బోగీలో పాకడం మొదలు పెట్టాయి. దీంతో ప్రయాణికులు గుండె చేతిలోకి వచ్చినంత పనైంది. అందరూ మూలలకు పరుగులు పెట్టారు. పైన బెర్త్‌ల కోసం ఎగబడ్డారు. కొందరు టాయిలెట్ రూమ్‌లలోకి పరుగు తీశారు.


బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు. దాదాపు అరగంట పాటు ఈ తతంగం అంతా కొనసాగింది. చాలా మంది రైల్వే కంట్రోల్ రూం కి ఫోన్ చేసి తమను కాపాడాలని కోరారు. రైలు ఎక్కిన గంట తరువాత ఆ పాములు ఆడించేవారు మహోబా స్టేషన్ లో దిగి వెళ్లిపోయారు. కొందరైతే రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి విజ్ఞప్తులు చేశారు. ఆ ట్రైన్ మహోబాకు రాగానే ఆ ప్రయాణికులు పోలీసుల వద్దకు వెళ్లారు. కానీ, పోలీసులు వచ్చేసరికే ఆ పాములాడించే వారు జారుకున్నారు. రైల్వే పోలీసులు వచ్చి బోగీ మొత్తం తనిఖీ చేసి పాములు లేవని నిర్ధారించారు. పాములు ఆడించేవారు వారితో పాటు తీసుకొని వెళ్లవచ్చని చెప్పారు. పోలీసులు వచ్చే లోపే వారు జారుకోవడంతో వారిని పట్టుకోలేకపోయారు. ప్రయాణీకులు మాత్రం తమను ఇంతగా భయపెట్టిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకొని కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. తనిఖీల అనంతరం రైలు తిరిగి గ్వాలియర్‌కు బయలుదేరింది. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story