JEE Main exam: ఒకే గ్రామం నుంచి జేఈఈ మెయిన్‌లో 40 మందికి పైగా ఉత్తీర్ణత..

జేఈఈ మెయిన్ ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. ఇందులో 2,50,236 మంది కటాఫ్ స్కోర్ సాధించి.. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారు. ఈ అర్హత పొందిన వారిలో సుమారు 40 మందికి పైగా ఒకే గ్రామానికి చెందిన వారు ఉన్నారు. బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో ‘ఐఐటీ గ్రామం’గా పేరు పొందిన పఠ్వాఠోలీ నుంచి వారంతా ఉత్తీర్ణత సాధించడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. అందులో వృక్ష సంస్థాన్ కోచింగ్ సెంటర్ నుంచి 28 మంది శిక్షణ పొందారు.
ఇక, ఈ గ్రామం ‘ఐఐటీ విలేజ్’గా పేరు పొందడానికి 1991లోనే బీజం పడింది. ఆ ఊరి నుంచి ఆ ఏడాది జితేంద్ర పఠ్యా ఐఐటీలో సీటు పొందాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ పరంగా ఎదిగి, అమెరికా స్థిరపడ్డాడు. కానీ తన మూలాలను మర్చిపోకుండా మిగతా వారు తన లాగే ఎదగాలని, “వృక్ష వి ద చెంజ్” పేరిట ఒక ఎన్జీఓను స్థాపించారు. ఇక, అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఐఐటీ అనే పదం వినపడుతుంది. సుమారు 20 వేల మంది గ్రామస్థులు ఉన్న పఠ్వాఠోలీని గతంలో మాంచెస్టర్ ఆఫ్ బీహార్‌గా పిలవగా.. వస్త్ర పరిశ్రమలు, చేనేత పని చేసుకునే వాళ్లు అక్కడ ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ గ్రామం ఇంజినీర్లకు నిలయంగా మారింది. ఇప్పటికీ అక్కడి కుటుంబాలు చేనేత పని చేస్తున్నారు.. వారి పిల్లలు మాత్రం విద్యారంగంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు.
అయితే, 2013లో ఏర్పాటైన వృక్ష సంస్థాన్.. ఐఐటీల్లో చదవాలనుకునే వారికి ఫ్రీ కోచింగ్ ఇస్తుంది. గ్రాడ్యుయేట్లు అందించే నిధులతో మెటీరియల్స్ అందజేస్తుంది.. ఢిల్లీ, ముంబైలో నివసించే వారు ఆన్‌లైన్ వేదికగా విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు.. చాలా కుటుంబాల్లో తమ పిల్లలను పట్టణాలకు పంపించి చదవించలేని పరిస్థితి ఉండటంతో.. అలాంటి వారి కోసమే మేం వృక్ష వేద చెయిన్‌ను ప్రారంభించామని.. ఒక లైబ్రరీ మోడల్‌ను ఏర్పాటు చేశామని ఆ సంస్థ ప్రెసిడెంట్ దుబేశ్వర్ ప్రసాద్ తెలియజేశారు. 10వ తరగతి వరకు చదవడమే కష్టమైన ఆ గ్రామంలో బాలికలు ఉన్నత విద్యవైపు వెళ్లడానికి అవకాశాలు పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ విద్యార్థులు నీట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com