Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా హిమపాతం

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా హిమపాతం
జాతీయ రహదారులు సహా 475 రోడ్లు మూసివేత

ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీగా మంచు కురుస్తోంది ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లోని వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండగా.. సిమ్లా సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షం, మంచు కారణంగా రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. దీంతో జాతీయ రహదారులు సహా 475 రోడ్లను అధికారులు మూసివేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంబాలో 56 రోడ్లు, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు సహా పలు జాతీయ రహదారును సైతం అధికారులు మూసివేశారు. భారీ హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

సిమ్లాలో సోమవారం ఉదయం 4.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రత కుకుమ్సేరి -ప్రాంతంలో -4.9 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. మంగళవారం వరకు ఎత్తైన కొండల్లో మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రయాణాలు ప్రారంభించే ముందు వాతావరణ పరిస్థితులను అంచనా వేయాలని, అత్యవసరం అయితే మాత్రమే జర్నీ చేయాలని సూచించారు. కాగా, నూతన సంవత్సరం తర్వాత హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story