Kolkata Rain: భారీ వరదలతో కోల్‌కతా అతలాకుతలం.. ఏడుగురు మృతి

కోల్‌కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్‌కతా వీధులన్నీ జలమయం అయ్యాయి. బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఎక్బాల్‌పూర్‌లో వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వర్షాలు కారణంగా సబ్బరన్ రైలు, మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక పలుచోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా భారీగా ఆస్తి కూడా నష్టం జరిగింది. వర్షాలు కారణంగా దసరా ఉత్సవాలకు అంతరాయం ఏర్పడింది.
కోల్‌కతాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ డేటా ప్రకారం.. గరియా కామదహరిలో 332 మి.మీ వర్షపాతం నమోదైంది. జోధ్‌పూర్ పార్క్‌లో 285 మి.మీ, కాళీఘాట్‌లో 280 మి.మీ, టాప్సియాలో 275 మి.మీ, బల్లిగంజ్‌లో 264 మి.మీ వర్షపాతం నమోదైంది.
24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 25-26 తేదీల్లో తీవ్ర వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com