Jammu Kashmir: భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

Jammu Kashmir:  భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
యమునానగర్-జగాద్రి రైల్వే స్టేషన్‌కు లష్కరే తోయిబా నుంచి బెదిరింపు లేఖ

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా కుప్వారా జిల్లాలోని మచిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ముష్కరులు యత్నించగా భద్రతా దళాలు, పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఏకే సిరీస్‌కు చెందిన అయిదు రైఫిల్స్‌ సహా పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మచిల్ సెక్టార్‌ ఆపరేషన్‌ జరిగిన కొన్ని గంటలకే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది. అర్నియా, ఆర్‌ఎస్‌ పురా సెక్టార్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఐదు భారత పోస్టులను పాక్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ BSF జవాను, నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. పాక్ రేంజర్ల కాల్పులకు భారత దళాలు ధీటుగా సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ 26న ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.


అంతకుముందు బుధవారం శ్రీనగర్ లోని 15 కార్ఫ్స్ కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. కాశ్మీర్ లో విదేశీ ఉగ్రవాదుల పాత్ర గురించి చర్చించారు. స్థానిక రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోవడంతో విదేశీ ఉగ్రవాదుల సంఖ్య పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 46 మంది ఉగ్రవాదులను మట్టుబెడితే.. ఇందులో 37 మంది పాకిస్తానీయులు కాగా.. 9 మంది స్థానికులు ఉన్నారు. 33 ఏళ్ల జమ్మూ కాశ్మీర్ తీవ్రవాద చరిత్రలో ఒక ఏడాదిలో స్థానిక ఉగ్రవాదుల కన్నా విదేశీ ఉగ్రవాదులు నాలుగు రెట్లు చనిపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 130 మంది ఉగ్రవాదులు పనిచేస్తున్నారనరి, వీరిలో సగం మంది పాకిస్తాన్ కి చెందిన వారే అని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు 26/11 దాడులకు కారణమైన లష్కరే తోయిబా నుంచి తాజాగా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. యమునానగర్-జగాద్రి రైల్వే స్టేషన్‌కు పంపిన ఆ లేఖలో.. దీపావళి రోజున తాము హర్యానాలోని యమునానగర్‌, అంబాలా, పానిపట్‌తో పాటు పలు రైల్వేస్టేషన్లను బాంబులతో లేపేస్తామని ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఆ లేఖలో పాకిస్థాన్ జిందాబాద్ అని కూడా రాసి ఉంది. దీంతో.. భద్రతా సంస్థలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ లేఖలో పేర్కొన్న రైల్వే స్టేషన్లకు భద్రతా దళాలను పంపించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చే, వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. తనిఖీలు చేయకుండా ఎవరినీ స్టేషన్లలోకి అనుమతించడం లేదు.ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అని తెలుసుకోవడం కోసం అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇప్పటివరకు ఆ లేఖకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం అధికారులకు దొరకలేదు.



Tags

Read MoreRead Less
Next Story