Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరోసారి అనుమానాస్పద డ్రోన్ల సంచారం

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి అనుమానాస్పద డ్రోన్ల కదలికలు మరోసారి భద్రతా వర్గాలను అప్రమత్తం చేశాయి. రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్, దూంగా గాలి ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సరిహద్దుల నుంచి వచ్చిన ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
డ్రోన్ల కదలికలను గమనించిన వెంటనే భారత సైన్యం స్పందించింది. వాటిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపింది. డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు లేదా నిషేధిత వస్తువులు ఏమైనా జారవిడిచి ఉంటారేమోనన్న అనుమానంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం కావడంతో నేలపై తనిఖీలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డ్రోన్ల సాయంతో కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
రాజౌరి సెక్టార్‌లో గత 48 గంటల్లో ఇలాంటి ఘటన రెండోసారి జరగడం భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ కార్యకలాపాలు పెరుగుతుండటంతో అప్రమత్తతను మరింత పెంచారు. గతేడాది మే నెలలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తరువాత ఇంత తక్కువ వ్యవధిలో వరుసగా డ్రోన్లు కనిపించడం ఇదే తొలిసారి.
చలికాలంలో మంచు కురిసే పరిస్థితులను ఆసరాగా చేసుకుని సరిహద్దుల అవతల ఉన్న శక్తులు డ్రోన్ల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఓసీ వెంబడి ఉన్న అన్ని భద్రతా పోస్టులను హై అలర్ట్‌లో ఉంచారు. రాత్రి వేళల్లో నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు యాంటీ-డ్రోన్ వ్యవస్థలను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

