Amrit Bharat Express: త్వరలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు..

Amrit Bharat Express:  త్వరలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు..
రైల్వేలో మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి

అమృత్‌ భారత్‌ రైళ్లకు మంచి స్పందన వస్తున్న క్రమంలో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. అమృత్‌ భారత్‌ రైలు సర్వీస్‌ భారీ విజయం సాధించిందని, దీంతో మరిన్ని రైళ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. అన్నీ నాన్‌ ఏసీ బోగీలు ఉండే రెండు అమృత్‌ భారత్‌ రైళ్లను గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలోనే మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పూర్తిగా నాన్ ఏసీ బోగీలతో నడిచే ఈ రైల్లో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దేశంలో తొలిసారిగా రెండు అమృత్‌ భారత్‌ రైళ్లను గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. వీటిలో ఒకటి ఉత్తరాది, ఒకటి దక్షిణాదిలో ప్రయాణిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరు 30న ఈ రైళ్లను ప్రారంభించగా.. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా నడుపుతున్నారు. తూర్పున పశ్చిమ్ బెంగాల్‌లోని మాల్దా నుంచి దక్షిణాదిన కర్ణాటకలోని బెంగళూరు మధ్య ఏపీ మీదుగా ఓ రైలు ప్రయాణిస్తోంది. రెండో రైలు యూపీలోని అయోధ్య నుంచి బీహార్‌లోని దర్భంగాకు నడుస్తుంది. మొత్తం 22 ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 12 స్లీపర్‌, 8 జనరల్‌, 2 లగేజీ కోచ్‌లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు వద్ద మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌, సమాచార వ్యవస్థ, బయో వ్యాక్యూమ్‌ టాయిలెట్లు, సెన్సార్‌ ట్యాప్‌లు, హారిజంటల్‌ స్లైడింగ్ విండోస్, సెమీ-పర్మనెంట్ కప్లర్లు, డస్ట్-సీల్డ్ వైడర్‌ గ్యాంగ్‌వేస్‌, ఏరోసోల్ బేస్డ్‌ ఫైర్‌ సప్రెషన్‌ సిస్టమ్‌, ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లైట్స్‌, ఫ్లోర్ గైడ్‌లతో సహా ఎల్‌హెచ్‌బీ కోచ్ బేస్డ్‌ పుష్-పుల్ అరేంజ్‌మెంట్‌ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి

పుష్‌-పుల్‌ సాంకేతికతతో తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన సీట్లు, ఎల్‌ఈడీ లైట్లు,ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లు ఉన్నాయి. ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించే వీలుంటుంది 800 కి.మీలకు పైగా దూరంలోఉన్న నగరాలను కలుపుతూ ఈ రైళ్లు సేవలందిస్తాయి. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు కనీస టికెట్ ధర రూ.35గా నిర్ణయించారు. రిజర్వేషన్ ఛార్జ్ మినహా సోర్స్ స్టేషన్ నుంచి 1-50 కి.మీ పరిధిలో ఉన్న డెస్టినేషన్‌లకు ఇది వర్తిస్తుంది. ఈ ఫేర్‌ విధానం సెకండ్‌ క్లాస్‌, స్లీపర్-క్లాస్ కంపార్ట్‌మెంట్లకు అమలవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story