Kumbh Mela 2025: 50 కోట్ల మంది పుణ్య స్నానాలు

Kumbh Mela 2025: 50 కోట్ల మంది పుణ్య స్నానాలు
X
మహా కుంభ మేళాలో రికార్డ్‌.. ఎనిమిది పెద్ద దేశాల జనాభా సంఖ్య కన్నా అధికం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్నానాలు చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఏ మతానికి సంబంధించి అయినా ఈ సంఖ్య మానవ చరిత్రలో అతిపెద్ద సామూహిక సమాజ భాగస్వామ్యంగా నిలుస్తుందని తెలిపింది. భారత్‌, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల జనాభా సంఖ్యను కుంభమేళాను దర్శించిన హిందూ యాత్రికుల సంఖ్య దాటేసిందని వెల్లడించింది.

యూఎస్‌ జనాభా బ్యూరో ప్రకారం చైనా, భారత్‌ తర్వాత అత్యధిక జనాభా(34.20 కోట్లు) గల మూడో దేశం అమెరికా. యూపీ సర్కార్‌ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్క రోజే సాయంత్రం 6 గంటల సమయానికి 92 లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో స్నానమాచరించారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభ మేళా గత నెల 13న ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది.

జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా ఇప్పటి వరకు అత్యధికంగా త్రివేణి సంగమంలో 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు మహా కుంభ మేళాకు తరలి వస్తూనే ఉన్నారు.

Devotees Maha Kumbh 2025 Maha Kumbh Mela Prayagraj

మరోవైపు కుంభమేళాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై యూపీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన నెలరోజుల్లో 53 సోషల్‌ మీడియా అకౌంట్లపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags

Next Story