RAINS: హిమాలయ రాష్ట్రాల్లో జల విలయం
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు సంభవించిన వరదలు(Cloudburst) పెను ఉప్పెనను తలపిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రం(Himachal Pradesh) వరదలతో గజగజ వణుకుతోంది. 24 గంటల వ్యవధిలో హిమాచల్‌లోనే 52 మంది ప్రాణాలు(50 Dead In Himachal Landslides) కోల్పోయారు. కొండచరియలు విరిగిపడి వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 621 రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారులపై వాహన రాకపోకలు స్తంభించాయి. ప్రధాన నదులు ఉప్పొంగడంతో వందలాది రోడ్లను అధికారులు మూసివేశారు. రిషికేష్‌లో గంగా మహోగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను అధికారులు 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
హిమాచల్ రాజధాని సిమ్లా(Himachal Pradesh rains)లో కొండ చరియలు పడి శివాలయం కూలిపోవడంతో శ్రావణ మాస పూజలు చేస్తున్న భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటివరకు 9 మృత దేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరో 25 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సిమ్లాలోనే మరోచోట కొండ చరియలు విరిగి పడటంతో అయిదుగురు మరణించారు. తుఫాను ధాటికి సోలాన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ఘటనలో ఇళ్లు కూలి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా 752 రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు స్తంభించాయి. 621 రోడ్లను మూసేశారు. గురువారం వరకు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన షిమ్లా-కల్కా రైల్వే లైను వర్షాల ధాటికి మట్టి కొట్టుకుపోయి గాల్లో వేలాడుతోంది.
ఉత్తరాఖండ్(Uttarakhand rains)ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్, చంపావత్, ఉధం సింగ్ నగర్ జిల్లాల్లో వాతావరణ శాఖ( Indian Meteorological Department ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చార్‌ధామ్ యాత్రను 2 రోజుల పాటు నిలిపివేశారు.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. దేవ్‌ప్రయాగ్, శ్రీనగర్‌లో గంగా, మందాకిని, అలక్‌నందా నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు మూసివేశారు. రుద్ర ప్రయాగ్‌లో కుంభవృష్టి కురిసింది. కొండ చరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే నడక మార్గాన్నిఅధికారులు మూసివేశారు. బైరవ్ గదేరా, లించోలి మధ్య రహదారి కొట్టుకపోవడంతో కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకపోయారు. బాన్స్వారా వద్ద రహదారి కోతకు గురవడంతో రుద్రప్రయాగ్-గౌరిఖుండ్ జాతీయ రహదారిని మూసివేశారు. బాన్స్వారా, బస్తీ వంతెనల వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో వరదలకు 60మంది మరణించగా.. 17మంది గల్లంతయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై సీఎం పుష్కర్ సింగ్ ధామి జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com