Congress: కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసిన శామ్ పిట్రోడా

అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తరహాలో దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలని కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. మరణించిన వారి ఆస్తులను కూడా కాంగ్రెస్ దోచుకోవాలనుకొంటున్నదని ధ్వజమెత్తారు.
అమెరికాలో వారసత్వ సంపదపై పన్ను ఉందని... అది తనకు న్యాయంగా అనిపించిందన్న కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు చేయడంతో ఖర్గే కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నతువంటి ఉద్దేశ్యాలు తమకు లేవన్నారు. అయినా శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తమపై ఎందుకు రుద్దుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని మరో నేత జైరాం రమేశ్ అన్నారు.
అసలేం జరిగిండంటే .. ఇటీవల శామ్ పిట్రోడా మాట్లాడుతూ... అమెరికాలో వారసత్వ పన్ను ఉందని, దాని ప్రకారం ఒక వ్యక్తి వద్ద 100 మిలియన్ డాలర్ల విలువైన సొత్తు ఉంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అందులో దాదాపు 45 శాతమే వారసులకు బదిలీ అవుతుందని... మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఇదొక ఆసక్తికరమైన అంశమని... అంటే సంపదను సృష్టించి వెళ్లిపోతున్న వారు ప్రజల కోసం దానిని వదిలేయాలన్నారు. అయినా వదిలేయాల్సింది మొత్తమేమీ కాదు... సగమే... ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందన్నారు.
పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. మరణించిన వారి ఆస్తులను కూడా కాంగ్రెస్ దోచుకోవాలనుకొంటున్నదని ధ్వజమెత్తారు. ‘తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై కాంగ్రెస్ పన్ను విధించాలని చూస్తున్నది. మీరు చెమట చిందించి కూడబెట్టిన సొత్తు.. మీ పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాదు.. చనిపోయినప్పుడు కూడా వారిని దోచుకోవడం కాంగ్రెస్ విధానంలా కనిపిస్తున్నది. పూర్వీకుల ఆస్తిని అనుభవిస్తున్న ఆ వ్యక్తులు (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ).. భారతీయులు తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు’ అని విరుచుకుపడ్డారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com