Ayodhya: అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎలా ఉండనుందంటే..

Ayodhya: అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఎలా ఉండనుందంటే..
51 అంగుళాల రాముడి విగ్రహం ప్రతిష్ఠ

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముడి విగ్రహం గురించిమరిన్ని ఆసక్తికర అంశాలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. గర్భగుడిలో ప్రతిష్టించే మూలవిరాట్టు పూర్తిగా శ్యామల్‌ వర్ణం అంటే.. నలుపు రంగులో ఉంటుందని తెలిపింది. రామ్‌లల్లా లేదా బాలరాముడి ప్రతిమను ఏ రాతితో చేశారు.

అయోధ్య ఆలయంలో గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాల రాముడు లేదా రామ్‌లల్లా విగ్రహం వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. మూలవిరాట్టు శ్యామల్‌ ఛాయ అంటే.. పూర్తిగా నల్ల రంగులో ఉంటుందని తెలిపింది. నిలుచుని ఉండే భంగిమలో ఐదేళ్ల రామచంద్రమూర్తి దర్శనమిస్తారని ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చంపత్‌ రాయ్‌ చెప్పారు. కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌, గణేశ్‌ భట్‌ అనే శిల్పులు నల్లరాతితో ఈ ప్రతిమను చెక్కారని తెలిపారు. ఒకటిన్నర టన్నుల బరువుతో పాదం బొటనవేలి నుంచి కనుబొమ్మల వరకు 51 ఇంచుల పొడవుతో విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి.. పాలు, నీటితో అభిషేకం చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ అభిషేక ద్రవ్యాలను మనుషులు సేవించినా ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. ప్రతీ శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముడి విగ్రహం నుదుటన పడి సూర్యతిలకం దిద్దేలా ఏర్పాటు చేశారు. రాకుమారుడిగా రాముడు దర్శనమివ్వనున్నారు. కళ్లు, నవ్వు, శరీరాకృతి, ముఖంలో దైవత్వం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 3 విగ్రహాలు పోటీలో నిలవగా 11 మంది ట్రస్టు సభ్యులు ఈ విగ్రహానికే ఓటు వేశారు. మిగిలిన రెండింటినీ ఆలయంలోనే ఇతర చోట్ల ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు ఆలయ నిర్మాణం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఏళ్లు గడిచే కొద్దీ భూగర్భంలో ఏర్పాటు చేసిన రాళ్లు సహజసిద్ధంగా మరింత గట్టిపడతాయని అధికారులు తెలిపారు. కాంక్రీటు 150 ఏళ్లకు మించి ఉండకపోవడం వల్ల నిర్మాణంలో ఎక్కడా దాన్ని వినియోగించలేదన్నారు. ఆలయ నిర్మాణంలో వినియోగించిన రాళ్లు వెయ్యేళ్ల క్రితం ఏర్పడినట్లు చెప్పారు. ఇనుమును వాడకుండా నిర్మాణం జరిగిందనీ..

గ్రనైట్‌ను పొరలుగా పేర్చడం వల్ల తేమను శోషించుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. దీని వల్ల సూర్యరశ్మి, గాలి, నీరు ఆలయాన్ని ప్రభావం చేయలేవని వెల్లడించారు. ఉత్తర భారతంలో గత 300 ఏళ్లలో ఇలాంటి ఆలయం రూపుదిద్దుకోలేదని ఇంజినీర్లు తెలిపారు

Tags

Read MoreRead Less
Next Story