Earthquake: అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో గంట వ్యవధిలోనే వరుస భూకంపాలు చోటుచేసుకున్నాయి. తొలుత త్రిపురలో... ఆ తర్వాత కొంత సేపటికే అస్సాంలో భూకంపం సంభవించింది. దీంతో జనాలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
అస్సాంలోని మోరిగావ్‌లో సోమవారం (జనవరి 5వ తేదీ) తెల్లవారుజామున భూకంపం చోటుచేసుకుందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైందని వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4:17 గంటలకు భూకంపం సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రం 26.37°N అక్షాంశం, 92.29°E రేఖాంశం వద్ద 50 కి.మీ లోతులో ఉందని పేర్కొంది. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... మోరిగావ్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.
అయితే భూకంపం వల్ల చోటుచేసుకున్న ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందారు. తెల్లవారుజామున భూకంపం చోటుచేసుకోవడంతో చాలా మంది నిద్రలో నుంచి మేల్కొని, ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. కొందరు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే అస్సాంలో భూకంపంకు సంబంధించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అస్సాంలో భూకంపం అన్నింటినీ కదిలించిందని... 5 సెకన్ల పాటు నిరంతరాయంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. మరొక నెటిజన్... గౌహతిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, భూకంపం తమను నిద్ర నుంచి కదలించిందని పేర్కొన్నారు.
సెంట్రల్ అస్సాంలోని కొన్ని ప్రాంతాలలోని నివాసితులు స్వల్పంగా లేదా మితంగా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారని... అయితే ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి తక్షణ నివేదికలు లేవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
త్రిపురలో భూకంపం
అస్సాం భూకంపం సంభవించడానికి కొన్ని గంటల ముందు ఈశాన్య రాష్ట్రం త్రిపురలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. త్రిపురలోని గోమతిలో కూడా 3.9 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం ఉదయం 03:33 గంటలకు చోటుచేసుకుంది. భూకంప కేంద్రం ఉత్తర అక్షాంశం 23.67 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 91.50 డిగ్రీల వద్ద ఉంది. 54 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

