HIJAB ROW: ఆపరేషన్ థియేటర్‌లోకి హిజాబ్ ప్రత్యామ్నాయం

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఏదో ప్రాంతంలో వివాదాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా కేరళలోని ఏడుగురు వైద్య విద్యార్థులు.. హిజాబ్‌కు ప్రత్యామ్నాయ డ్రెస్‌ను ఆపరేషన్ థియేటర్‌లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు ముస్లిం విద్యార్థులు ఆపరేషన్ థియేటర్ లోపల లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు... సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ థియేటర్లలోకి హిజాబ్‌కు ప్రత్యామ్నాయాలను అనుమతిపై చర్చించేందుకు సర్జన్లు, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ టీమ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు చేసిన అభ్యర్థనపై బృందం నిర్ణయం తీసుకుంటుందని తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
తమ మత విశ్వాసాల్లో భాగంగా తమ తలలను ఎప్పుడూ వస్త్రంతో కప్పి ఉంచుకోవాలని... అందుకే హిజాబ్ ప్రత్యామ్నాయలను అనుమతించాలని ముస్లిం విద్యార్థులు తెలిపారు. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గతంలో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా- వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ పలువురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తొలుత జస్టిస్ కృష్ణ దీక్షిత్ ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఆ తర్వాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై పదిహేను రోజుల పాటు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ తుది తీర్పు వెలువరించింది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భిన్న తీర్పులు వెలువరించారు. వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. విద్యార్థుల చదువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్ సుధాంశు ధులియా అభిప్రాయపడ్డారు. దీంతో తుది తీర్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేశారు. హిజాబ్ వివాదంపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ తెలిపారు. మరోవైపు కర్ణాటకలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సింగిల్ బెంచ్ కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com