Operation Sindoor: పాక్ ఉగ్ర కుట్రలపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత ఎంపీల బృందాలు

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, వివిధ దేశాలకు పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ బృందాలు పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను, వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు పార్లమెంటు సభ్యుల పేర్లను ఈరోజు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌తో పాటు, రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ - ఎస్పీ), శ్రీకాంత్ షిండే (శివసేన) ఈ జాబితాలో ఉన్నారు.
ఈ ఎంపీల నేతృత్వంలోని ఏడు బృందాలు, మే 22న విదేశీ పర్యటనకు బయలుదేరి, పది రోజుల వ్యవధిలో ఐదు దేశాలను సందర్శించనున్నాయి. జూన్ మొదటి వారంలో ఈ బృందాలు తిరిగి వస్తాయని సమాచారం. ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే సభ్యులను ఎంపిక చేసింది.
ఈ ప్రతినిధి బృందాలు ప్రధానంగా ఐదు కీలక అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి:
1. "ఆపరేషన్ సిందూర్" చేపట్టడానికి దారితీసిన పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు.
2. పాకిస్థాన్ బెదిరింపులకు ప్రతిగా భారత్ "ఆపరేషన్ సిందూర్"ను ఎలా సమర్థవంతంగా నిర్వహించిందో తెలియజేయడం.
3. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలపై స్పష్టత ఇవ్వడం.
4. "ఆపరేషన్ సిందూర్" సమయంలో కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేయడం.
5. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని, దాని వల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును ఆధారాలతో సహా వివరించడం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com