Tragedy: 35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వ్యక్తి వివాహం..తెల్లారేసరికి...

అతడు 75 ఏండ్ల వృద్ధడు. ఏడాది కిందే ఇన్నాళ్లు తోడుగా నడిచిన భార్య చనిపోయింది. ఒంటరి జీవితం ఎందుకు అనుకున్నాడో ఏమో త వయస్సులో సగం కూడా లేని మహిళలను పెండ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా సాధారణమే అనుకుంటున్నారా.. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. వారి పెండ్లి జరిగిన మరుసటి రోజు ఉదయమే అతడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా కుచ్‌ముచ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కుచ్‌ముచ్ గ్రామంలో సంగ్రురామ్ అనే 75 ఏండ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం అతని భార్య మరణించింది. వారికి పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ తనను తాను పోషించుకుంటున్నాడు. అయితే జీవిత చరమాంకంలో తనకు తోడు అవసరమని నిర్ణయించుకున్న అతడు మరో పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే దీనికి అతని కుటుంబం ఒప్పుకోలేదు. మరో వివాహం చేసుకోవద్దని కోరింది. కానీ వారి మాటలు వినకుండానే జలాల్‌పూర్ ప్రాంతానికి చెందిన మన్భవతి అనే 35 ఏండ్ల మహిళను సెప్టెంబర్ 29న వివాహం చేసుకున్నాడు. ముందుగా హైకోర్టులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత, సంప్రదాయ పద్దతిలో మనువాడారు.
పెండ్లి రోజు రాత్రి ఇద్దరూ ఎక్కువ సమయం మాట్లాడుకుంటూ గడిపారు. తన పిల్లలను బాగా చూసుకుంటానని సంగ్రురామ్ హామీ ఇచ్చినట్లు మన్భవతి తెలిపింది. అయితే, ఉదయం నాటికి అతడి ఆరోగ్యం ఓక్కసారిగా క్షీణించింది. దవాఖానకు తీసుకెళ్లేలోపే మరణించాడు. దీంతో వివాహమైన మరునాడే సంగ్రామ్ సింగ్ హఠాత్తుగా మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఉంటున్న అతని మేనల్లుళ్లు సహా బంధువులంతా దహన సంస్కారాలు నిలిపేశారు. పోలీసు విచారణ, పోస్టుమార్టం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com