Indian Army: రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ఠ నిఘా

గణతంత్ర దినోత్సవానికి భారతావని సిద్ధమవుతున్న వేళ ఉగ్రమూకలు విధ్వంసం సృష్టించే అవకాశం ఉండడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల నుంచి దేశంలోకి ఎవరూ చొరబడకుండా.. పహారా కాస్తోంది. రిపబ్లిక్ డే వేడుకల వేళ ముష్కరుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో సరిహద్దులపై నిరంతర నిఘాను కొనసాగిస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో షిఫ్టుల వారీగాసైనికులు పహారా కాస్తున్నారు. నైట్ విజన్ ఆయుధాలతో కంటి మీద రెప్ప కూడా వేయకుండా 24 గంటలపాటూ పహారా కాస్తున్నట్లు విధుల్లో ఉన్న సైనికులు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని గురేజ్, బందిపొరాలో సుశిక్షితులైన స్నైపర్‌లను మోహరించారు. కృత్రిమ మేధను ఉపయోగించి అధునాతన సాంకేతికతతో తయారు చేసిన ఆయుధాలతో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్ విజన్ పరికరాలతో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని సైనికులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని వీటి ద్వారా ఎంత చీకటి సమయంలోనైనా శత్రువుల రాకపై దృష్టి పెట్టవచ్చని తెలిపారు. దేశంలోకి సరిహద్దుల గుండా ఎవరూ ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో ముఖానికి రంగులు పోసుకుని... గాడాంధకారంలో సైనికులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com