తరగతి గదిలో తాతగారు.. తొమ్మిది పాఠాలు చదివేస్తున్నారు..

తరగతి గదిలో తాతగారు..  తొమ్మిది పాఠాలు చదివేస్తున్నారు..
మిజోరాంకు చెందిన 78 ఏళ్ల వృద్ధుడు 9వ తరగతిలో చేరాడు, రోజూ 3 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళుతున్నాడు.

చదువుకోవడానికి వయసుతో పనేముంది. ఏ వయసులో అయినా ఎంచక్కా చదువుకోవచ్చు. ఆసక్తి ఉండాలే కానీ వయసు అస్సలు అడ్డు కాదు అని మరోసారి మిజోరాంకు చెందిన 78 ఏళ్ల వృద్ధుడు నిరూపించాడు.. తొమ్మిదో క్లాసులో జాయినయ్యాడు.. 3 కి.మీ నడిచి మరీ బడికి వెళుతున్నాడు. పొద్దున్నే లేచి భుజానికి బ్యాగు తగిలించుకుని బడికి వెళుతున్న తాతను చూచి ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు.

1945లో చంపై జిల్లాలో జన్మించిన లాల్రింగ్థరా చిన్న వయస్సులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. కుటుంబం గడవడం కోసం పొలాల్లో పని చేస్తున్న తల్లికి సహాయం చేసేవాడు. తూర్పు మిజోరాంకు చెందిన 78 ఏళ్ల వ్యక్తి తన పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయాడు.. దాంతో ఎప్పటికైనా పది పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నాడు.. ఎప్పటికప్పుడు బాధ్యతలు, ఆటంకాలు.. కానీ మనసులో చదువుకోవాలనే కోర్కె మాత్రం అలానే ఉండిపోయింది. 78 వయసులో కళ్లు కూడా సరిగా కనిపించవు.. అయినా కళ్లజోడు దరించి పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. పాఠశాల యూనిఫాం ధరించి, పుస్తకాల బ్యాగ్‌ తీసుకుని బడికి వెళుతున్నాడు. చదువుకోవడం కోసం ప్రతిరోజూ 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు.

హ్రుయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగ్థరా కథ ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా మారింది. అతను ప్రస్తుత విద్యా సంవత్సరానికి హ్రువైకాన్ గ్రామంలోని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో చేరాడు. ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో 1945లో జన్మించిన లాల్రింగ్థరా తన తండ్రి మరణం కారణంగా 2వ తరగతి తర్వాత తన విద్యను కొనసాగించలేకపోయాడు. అతను ఒక్కడే సంతానం కావడంతో తల్లికి సహాయంగా ఉండేవాడు.

జీవన భుక్తి కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుండేది లాల్రింగ్థరా కుటుంబం. చివరకు 1995లో న్యూ హ్రూయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. దుర్భర పేదరికం అతని పాఠశాల జీవితాన్ని సంవత్సరాల తరబడి నాశనం చేసింది. అతను తన ఆంగ్ల నైపుణ్యాలను మెరుగుపరచాలనుకున్నందున అతను తిరిగి పాఠశాలకు వెళ్ళాడు. అతని ప్రధాన లక్ష్యాలు ఆంగ్లంలో అప్లికేషన్లు రాయడం, టెలివిజన్ వార్తలను అర్థం చేసుకోవడం.

తన మాతృభాష మిజోలో లాల్రింగ్థరా చదవడం, రాయడం చేయగలరు. అతను ప్రస్తుతం న్యూ హ్రూయికాన్‌ చర్చిలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. "మిజో లాంగ్వేజ్‌లో చదవడానికి లేదా రాయడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. అయినప్పటికీ, ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే నా మక్కువ వల్ల విద్యపై నా కోరిక పెరిగింది. అందువల్ల నేను నా పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా ఆంగ్ల భాషలో ప్రావిణ్యం సంపాదించాలనుకుంటున్నాను.. నేను దానిని సాధిస్తాను అని మీడియాకు వివరించాడు.

Tags

Read MoreRead Less
Next Story