Digital Arrest: ప్లాట్‌లు అమ్మి మరీ ₹2 కోట్లు చెల్లించిన మహిళా టెకీ!

Digital Arrest: ప్లాట్‌లు అమ్మి మరీ ₹2 కోట్లు చెల్లించిన  మహిళా టెకీ!
X
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో లూటీ

సైబర్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్టుపై ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సైతం వీటి బారిన పడి రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెకీ డిజిటల్‌ అరెస్టు భయంతో 2 ప్లాట్‌లు, ఓ ఫ్లాట్‌ అమ్మి మరీ సైబర్‌ నేరస్థులకు రూ.2 కోట్లు చెల్లించింది. కొన్ని నెలల పాటు సాగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్న బబితా దాస్ తన పదేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది. జూన్‌లో ఓ వ్యక్తి కొరియర్ అధికారిగా నటిస్తూ ఆమెకు కాల్‌ చేశాడు. ‘మీ ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ కార్డు వివరాలతో అనుసంధానమై ఉన్న పార్సిల్‌లో అనుమానాస్పద వస్తువులు వచ్చాయి’’ అని తెలిపాడు. ఆ తర్వాత మరికొందరు వ్యక్తులు తాము ముంబయికి చెందిన పోలీసులమంటూ బబితా దాస్‌కు ఫోన్‌ చేశారు. ‘‘మీ పేరుతో ఉన్న పార్సిల్‌లో అనుమానాస్పద వస్తువులు ఉండటంతో డిజిటల్‌ అరెస్టు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కొన్ని మొబైల్‌ యాప్‌లను ఆవిడ చేత ఇన్‌స్టాల్‌ చేయించారు.

తాము చెప్పినట్లు వినకపోతే కుమారుడి విషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. పరిశీలన కోసం ఖాతాల్లో ఉన్న డబ్బు, ఆస్తుల వివరాలు తెలపాలని డిమాండ్‌ చేశారు. కుమారుడి భవిష్యత్‌ గురించి భయపడిన టెకీ తన ఆస్తుల వివరాలన్నీ వారికి తెలియజేసింది. అనంతరం వారు సూచించిన విధంగా విజ్ఞాన్ నగర్‌లోని ఫ్లాట్‌ను, మలూర్‌లో తనకున్న రెండు ప్లాట్‌లను అమ్మి మొత్తం డబ్బులను సైబర్‌ నేరగాళ్లు పంపిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. ఇంకా డబ్బులు పంపాలని వారు బెదిరింపులకు పాల్పడడంతో బ్యాంకు నుంచి లోన్‌ తీసుకొని, మరీ చెల్లించింది.

డేటా పంచుకోవడంపై వినియోగదారుల అనుమతి తప్పనిసరి

నవంబర్‌ నెలాఖరులో చివరిగా కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ తెచ్చుకుని, చెల్లించిన సొమ్మును తిరిగి పొందాలని సూచించారు. ఆపై కాల్‌ కట్‌ చేశారు. తర్వాత వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్‌లు స్విచ్ఆఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన టెకీ.. స్థానిక వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తంగా 22 దఫాల్లో సైబర్‌ నేరగాళ్లతో లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించామని.. వాటిని బ్లాక్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags

Next Story