SONU SOOD: ఏ సాయమైనా సోనూ సూద్‌కే "సంభవం"

SONU SOOD: ఏ సాయమైనా సోనూ సూద్‌కే సంభవం
X
సోనూ సూద్‌ ఫౌండేషన్‌ మరో కీలక నిర్ణయం.... ఐఏఎస్‌, ఐపీఎస్‌ అభ్యర్థులకు స్కాలర్‌ షిప్‌ తేదీ గడువు పెంపు... జులై 17లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన...

సినిమాల్లో అతను కరుడుగట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యం నుంచి వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట దేవుడుగా మారిపోయాడు బాలీవుడ్ న‌టుడు సోను సూద్‌. అంద‌రి దృష్టిలో రియల్ హీరోగా మారాడు. కార్మికులు కాలి న‌డ‌క‌న వెళ్లకుండా వారికి భోజ‌నం ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా బ‌స్సులు ఇచ్చి మ‌రీ ఇంటికి చేర్చాడు. అలాగే కేర‌ళ‌లో చిక్కుక‌పోయిన ఒడిశా కూలీల‌ను త‌న సొంత డ‌బ్బుల‌తో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి పంపించి తన ఉదార‌త చాటుకున్నాడు. తాజాగా మ‌రో సారి సోనూ సూద్ త‌న సేవ‌భావాన్ని చూపించాడు.


ఏ సాయం చేయాలన్నా.. ఎవరిని ఆదుకోవాలన్నా అది సోనూసూద్‌కే సంభవం అనేలా మరో ఘన కార్యానికి పూనుకున్నాడు సోను సూద్‌. అడగందే అమ్మ అయినా పెట్టదనే సామెతను చెరిపేస్తూ అడగకుండానే సాయం చేస్తూ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు సోనూ. ఇప్పుడు భావి భారత పౌరులను సమర్ధవంతమైన అధికారులుగా తయారు చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఎంతో మందికి ఆర్థికంగా, వైద్యపరంగా, సాయం చేస్తున్న సోనూ సూద్ ఇప్పుడు యువత కోసం అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కలలు కనే విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసమే ప్రత్యేకంగా సంభవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తారు.


ఈ స్కాలర్‌షిప్‌ల కోసం భారీగా దరఖాస్తులు వస్తుండడంతో సోనూ సూద్‌ ఫౌండేషన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద సంఖ్యలో అప్లికేషన్‌లు వస్తున్నందున IAS కోచింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం గడువును జులై 17వ తేదీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతాధికారులుగా మారాలని విజ్ఞప్తి చేసింది. ఐఏఎస్ అభ్యర్థులు స్కాలర్‌షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు జులై 17లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సోనుసూద్ కోరారు.


ఇప్పటికే సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ సహకారంతో సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం సంభవం కార్యక్రమం కింద ఉచిత ఆన్‌లైన్ IAS కోచింగ్‌ను అందిస్తోంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత కోచింగ్‌ పొందేందుకు, IAS ప్రవేశ పరీక్షలలో పోటీ పడే సమాన అవకాశాలను పెంచేందుకు సోనూసూద్‌ ఫౌండేషన్‌ సాయం చేస్తోంది.

Tags

Next Story