Dharmasthala Case: అనేక వ్యత్యాసాలు.. అసత్య ఆరోపణలు.. ధర్మస్థల కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

Dharmasthala Case: అనేక వ్యత్యాసాలు.. అసత్య ఆరోపణలు.. ధర్మస్థల కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌
X
సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..

వందలాది మృతదేహాల ఖననం జరిగిందన్న ఆరోపణలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ధర్మస్థలలో రేప్‌ చేసి హత్యకు గురైన వందలాది మృతదేహాలను ఖననం చేశానన్న పారిశుద్ధ్య కార్మికుడు యూ టర్న్‌ తీసుకున్నాడు. తనకేమీ తెలియదంటూ మాటమార్చాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే తన కుమార్తె తప్పిపోయిందంటూ బెంగళూరు మహిళ చెప్పినవన్నీ కూడా కట్టు కథలేనని నిర్ధారించారు.

మాయమాటలు చెప్పి వ్యవస్థను నమ్మించడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడు తనకేమీ తెలియదని అంటున్నాడని, కొందరు ఒక పుర్రెను చేతికిచ్చి అధికారులకు ఫిర్యాదు చేయమన్నారని, కోర్టులో కేసు కూడా వారే వేయించారని సిట్‌కు చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఇంత సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు ఉత్తదేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య అలియాస్‌ చెన్నా చెప్పినవన్నీ అబద్ధాలు, కట్టుకథలేనని అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో ఆయన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేశాడు. అయితే దానిని ప్రత్యేక దర్యాప్తు బృందం విశ్వసించ లేదు. అయితే అతడు చెప్పిన విధంగా వారు తవ్వకాలు జరపడం, అతను పేర్కొన్నట్టు ఏమీ లభ్యం కాకపోవడంతో అనుమానం వచ్చిన సిట్‌ అధికారులు అతడిని తిరిగి ప్రశ్నించి, అతడు అబద్ధాలు చెబుతున్నట్టు కనుగొన్నారు. దీంతో అప్పటివరకు సాక్షిగా అతనికి కల్పిస్తున్న రక్షణను, ముసుగును తొలగించి అతడి పేరును తొలిసారిగా వెల్లడించారు. అతను మండ్యకు చెందిన సీఎస్‌ చిన్నయ్యగా పేర్కొన్నారు. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు అతడిని అరెస్ట్‌ చేశారు.

అనన్య అనే అమ్మాయే లేదు

ధర్మస్థల కేసులో మరో షాకింగ్‌ యూటర్న్‌ చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ చదువుతున్న తన కుమార్తె అనన్య భట్‌ ధర్మస్థలలో అదృశ్యమైందంటూ ఇంతవరకూ ఆరోపణలు చేస్తున్న ఆమె తల్లి సుజాత భట్‌ షాకిచ్చే ప్రకటన చేసింది. అసలు అనన్య భట్‌ పేరుతో ఎవరూ లేరని ఒక యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఆమె తాజాగా మరో యూటర్న్‌ తీసుకుని, తనను అలా చెప్పమని కొందరు బలవంతం చేశారని ప్రకటించింది.

Tags

Next Story