Allahabad High Court: భయం వల్ల అంగీకరించినా మహిళతో సంబంధం అత్యాచారమే

Allahabad High Court: భయం వల్ల అంగీకరించినా మహిళతో సంబంధం అత్యాచారమే
X
అలహాబాద్‌ హైకోర్టు తీర్పు

పురుషునితో లైంగిక సంబంధానికి మహిళ అంగీకరించినప్పటికీ, అటువంటి అంగీకారానికి కారణం ఆమె భయపడటం లేదా తప్పుడు తలంపు అయినట్లయితే, ఆ లైంగిక సంబంధం అత్యాచారమే అవుతుందని అలహాబాద్‌ హైకోర్టు చెప్పింది. పెండ్లి చేసుకుంటాననే సాకుతో అత్యాచారానికి పాల్పడినట్లు తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ రాఘవ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ కేసు 2018 డిసెంబరులో ఆగ్రా జిల్లాలో నమోదైంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటుపై ఆగ్రా జిల్లా, సెషన్స్‌ జడ్జి కోర్టులో విచారణ జరుగుతున్నది. రాఘవ్‌ కుమార్‌ మొదట బాధితురాలిని స్పృహలేకుండా చేసి, శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత పెండ్లి చేసుకుంటానని చెప్తూ ఆమెను అనేకసార్లు శారీరకంగా దోచుకున్నాడని ఈ ఛార్జిషీటులో ఆరోపించారు. రాఘవ్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వీరిద్దరూ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్నారని, చాలా కాలం నుంచి పరస్పర సమ్మతితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పారు.

ఇది ఐపీసీ సెక్షన్‌ 376 క్రిందకు వచ్చే అత్యాచార నేరం కాదని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వీరిరువురి మధ్య సంబంధం మోసపూరితంగా ప్రారంభమైందని తెలిపారు. రాఘవ్‌ బలవంతం చేశాడని చెప్పారు. బాధితురాలి సమ్మతి లేదన్నారు. హైకోర్టు ఈ నెల 10న తీర్పు చెప్తూ, రాఘవ్‌ ప్రారంభంలో మోసపూరితంగా, భయపెట్టి సంబంధం పెట్టుకున్నాడని, ఇది ఐపీసీ సెక్షన్‌ 376 పరిధిలోకి వచ్చే నేరం అవుతుందని స్పష్టం చేసింది. తదనంతర కాలంలో పెండ్లి చేసుకుంటాననే హామీతో ఇరువురి మధ్య పరస్పర సమ్మతితో సంబంధం ఏర్పడినట్లు కనిపించినప్పటికీ, రాఘవ్‌ భయపెట్టడం వల్ల అటువంటి సమ్మతిని తెలిపినట్లుగా చెప్తున్నారని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును రద్దు చేయాలనే పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

Tags

Next Story