వింత గొడవ.. జీన్స్ వేసుకోమన్న అత్తగారు.. చీర కట్టుకుంటానన్న కోడలు

వింత గొడవ.. జీన్స్ వేసుకోమన్న అత్తగారు.. చీర కట్టుకుంటానన్న కోడలు
అమ్మ దగ్గర ఉంటే అన్నీ నడుస్తాయి. అదే అత్తగారింటికి వెళితే వాళ్లకు తగ్గట్టు నడుచుకోవాలి.

అమ్మ దగ్గర ఉంటే అన్నీ నడుస్తాయి. అదే అత్తగారింటికి వెళితే వాళ్లకు తగ్గట్టు నడుచుకోవాలి. అత్తారింటికి వెళ్లే ప్రతి అమ్మాయికి అమ్మ మరీ మరీ చెప్పి పంపిస్తుంది. మరి వాళ్ల అమ్మ చెప్పినవేవీ అక్కడ నడవట్లేదే.. పైగా అత్తేమో జీన్స్ వేసుకోమని కోడల్ని వత్తిడి చేస్తోంది. అందుకే కదా వార్త అయ్యింది. ఈ వింత సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.

ప్రతి ఆదివారం, ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో కుటుంబ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అక్కడికి వచ్చిన ఓ వింత కేసు అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. హరిపర్వత్ ప్రాంతానికి చెందిన యువకుడికి ఎత్మాద్‌పూర్ కి చెందిన బాలికతో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. యువకుడు ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.

బాలిక గ్రామీణ ప్రాంతానికి చెందినది. అందుకే ఆమె కట్టుబొట్టు కూడా ఆ ప్రాంతానికి తగ్గట్టే ఉండేది. కోడలు మరీ అంత పాత కాలం పద్దతులు పాటించడం అత్తగారికి ఏ మాత్రం నచ్చలేదు. మోడ్రన్ గా ఉండాలని ఆశ పడింది. అందుకే ఆమెను జీన్స్ వేసుకోమని వత్తిడి తెచ్చేది. జీన్స్ వేసుకోవడం సుతరామూ ఇష్టం లేని కోడలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కి పరిగెట్టింది.

భర్త కూడా తన తల్లి పక్షం వహిస్తూ ఆమె తానా అంటే ఇతడు తందానా అంటున్నాడని బాలిక ఆరోపించింది. కౌన్సెలర్ ఇరువర్గాల మాటలను విన్నారు. అత్తాకోడళ్లకు నచ్చచెప్పి పంపించారు. సంసారం అన్నాక సర్దుకుపోవాలన్నారు. పదహారణాల ఆడపడుచులా ఉంటానంటే కాదంటావేంటని అత్తగారిని, అప్పుడప్పుడైనా అత్తమాట వినమ్మా అని కోడలికీ చెప్పి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story