Delhi: ఢిల్లీలో రోజురోజుకూ ముదురుతున్న ఆప్ వర్సెస్ బీజేపీ వార్..

Delhi: బీజేపీ, ఆప్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. సోమవారం బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విఫలమైందన్నారు. సొంత ప్రభుత్వంపైనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇవాళ దీనిపై ఓటింగ్ జరగనుంది. ఆప్ ప్రభుత్వానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి అమ్ముడు పోడని నిరూపించేందుకే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ 20 కోట్ల చొప్పున ఆఫర్ చేసిందని..అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలను కొనలేకపయారని ఆరోపించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీజేపీ లాంటి అత్యంత అవినీతి సర్కార్‌ను దేశం ఎన్నడూ చూడలేదన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు బీజేపీ నేతలు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని కేజ్రీవాల్‌ను ఎవరు డిమాండ్ చేశారని ప్రశ్నించారు బీజేపీ నేత అమిత్ మాలవీయ. కేవలం లిక్కర్, ఎడ్యూకేషన్ కుంభకోణాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే విశ్వాస తీర్మానం తెచ్చారని అన్నారు. కేజ్రీవాల్ సర్కార్‌కు ఇప్పుడు వచ్చిన ముప్పేమి లేదన్నారు. కేజ్రీవాల్‌పై మండిపడ్డారు నార్త్‌ఈస్ట్ ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ. 70 మంది ఎమ్మెల్యేలలో ఆప్‌కు 60కి పైగా ఎమ్మెల్యేలున్నారని.. విశ్వాస తీర్మానం సులభంగానే ఆమోదం పొందుతుందన్నారు.
ఇది ప్రజా ధనం, సమయం వృథా చేయడమేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాగ్ నివేదికపై చర్చించి..మద్యం, స్కూల్ తరగతుల నిర్మాణానికి సంబంధించిన లూటీ వివరాలు ఇవ్వలాలన్నారు. ఇక సోమవారం రాత్రి ఢిల్లీ అసెంబ్లీ పరిసరాల్లో హై డ్రామా కొనసాగింది. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోటీగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల దగ్గర ఆందోళనకు దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు.
ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ సక్సెనా..గతంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఛైర్మెన్‌గా పని చేశారని.. ఆ టైంలో 14 వందల కోట్ల రూపాయల విలువైన డిమానిటైజ్డ్ నోట్లను మార్చాలంటూ తన ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఆరోపించింది. ఐతే ఆప్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇక మరోవైపు ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను పదవు నుంచి తప్పించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com