Maharashtra Assembly Elections: ఇండియా కూటమికి ఆప్ షాక్

Maharashtra Assembly Elections: ఇండియా కూటమికి ఆప్ షాక్
X
మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగా పోటీ

ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గట్టి షాక్ ఇచ్చింది. త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. జాతీయ స్థాయిలో భారత కూటమిలో భాగమైనప్పటికీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో భాగం అయ్యేందుకు ఆప్ ఒప్పుకోలేదు. ముంబైలోని మొత్తం 36 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించుతామని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.

కాగా, తమ పార్టీ దశాబ్ద కాలం నుంచి దేశ రాజధాని ఢిల్లీని పరిపాలిస్తోందని.. ఢిల్లీ మోడల్ విద్య, ఆరోగ్యం లాంటి పథకాలతో పట్టణ ప్రాంతాలలో బాగా రాణిస్తోందని ఆప్‌ నేత ప్రీతిశర్మ మీనన్‌ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 27 మున్సిపల్ కార్పొరేషన్లలో ముంబైకి ప్రజా ప్రతినిధులు లేరని అన్నారు. ముంబైలో మౌలిక సదుపాయాలు నాసిరకంగా ఉన్నాయని ఆప్‌ విమర్శలు గుప్పించారు. పరిష్కారం కాని సమస్యగా గృహ నిర్మాణ శాఖ మిగిలిపోయిందన్నారు. బిల్డర్, కాంట్రాక్టర్ మాఫియా ముంబై నగరాన్ని స్వాధీనం చేసుకుందని ఆరోపణలు చేశారు.

ఇక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తాం.. అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో స్నేహం అలాగే కొనసాగుతుం‍ది అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ పాలన మోడల్‌ను చూపించే ఎన్నికలకు వెళ్తాం.. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంపై అసలు పట్టింపే లేదని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్లకు లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు గుజరాత్‌ కోసమే పని చేస్తుంటారు.. మహారాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదని ప్రీతిశర్మ మీనన్‌ ఆరోపించారు.

Tags

Next Story