Ed Chief: ఈడీ చీఫ్‌గా రాహుల్‌ నవీన్‌

Ed Chief: ఈడీ చీఫ్‌గా రాహుల్‌ నవీన్‌
X
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్‌ నవీన్‌ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నవీన్‌ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు. 57 ఏండ్ల నవీన్‌ ఈడీలో 2019 నవంబర్‌లో ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌ 15న నవీన్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈయన హయాంలోనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌లను మనీ లాండరింగ్‌ కేసుల్లో ఈడీ అరెస్ట్‌ చేసింది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోవింద్‌ మోహన్ని నియమితులయ్యారు. వీరి నియామకానికి బుధవారం క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అజయ్‌ కుమార్‌ భల్లా ఈ నెల 22వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సిక్కిం క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి, సాంస్కృతికశాఖ కార్యదర్శి, హోంశాఖలో ఓఎస్‌డీగా ఉన్న గోవింద్‌ మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శిగా నియమించింది. ఆయన ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందినవారు. బాధ్యతలు చేపట్టగానే గోవింద్‌ మోహన్‌కు ఎదురయ్యే తొట్టతొలి సవాలు జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలు. సెప్టెంబరు 30లోగా ఈ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.

Tags

Next Story