TVK Vijay: తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్

తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా, గుర్తును స్టార్ హీరో, ఆ పార్టీ చీఫ్ విజయ్ ఆవిష్కరించారు. ఆయన ఇటీవీల టీవీకే పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఎరుపు, పసుపు రంగుల్లో మధ్యలో సూర్యకిరణాలు, దానికి ఇరువైపులా రెండు ఏనుగులతో ఉన్న పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. దీంతోపాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తించుకుంటామన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగిస్తామని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్ధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు, మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ అడుగులు వేస్తున్నారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com