Actor Vijay: నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్‌ కౌంటర్‌

Actor Vijay: నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్‌ కౌంటర్‌
X
ఆ విషయంలో నిజంగా అంత బాధపడ్డారా..

తమిళనాడుకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్‌పై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను ‘తమిళగ వెట్రి కళగం ’ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ తీవ్రంగా ఖండించారు. ఏళ్లు గడిచినా పెరియార్‌ పేరు వాడకుండా ఉండలేని విధంగా ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారని మంత్రికి కౌంటర్ ఇచ్చారు.

తమిళ భాషను అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారంటూ ఈవీకే పెరియార్‌ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా రాజ్యసభలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను విజయ్‌ తప్పుపట్టారు. సమాజంలోని సాంఘిక దురాచారాలను పారదోలడానికి పెరియార్ చేసిన కృషిని కొనియాడారు. పెరియార్‌ బాల్య వివాహాలను వ్యతిరేకించారని, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారని, కులం పేరిట జరిగిన అకృత్యాలను ఖండించారని విజయ్‌ గుర్తుచేశారు.

సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఉండాలని మనం ఇప్పుడు మాట్లాడుతున్న విషయంపై ఆయన వంద సంవత్సరాల క్రితమే పిలుపునిచ్చి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని విజయ్‌ అన్నారు. పెరియార్ తమిళ భాషను అవమానించినందుకు కేంద్రమంత్రి నిజంగానే బాధపడ్డారా..? అని ప్రశ్నించారు. మీరు నిజంగా బాధపడి ఉంటే త్రిభాషా సూత్రాన్ని మాపై రుద్దడం ఆపేస్తారా..? అని క్వశ్చన్‌ చేశారు.

కాగా పెరియార్ గురించి ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే అవి వివాదాస్పదం అవుతుంటాయని, తమిళనాడు ప్రజల మనసులో ఆయన ఎలా నిలిచి ఉన్నారో, ఆయనను ఎలా గౌరవిస్తున్నారో అనేది అర్థం కావడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని అన్నారు. జాతీయ విద్యా విధానంలోని (NEP-2020) త్రిభాషా సూత్రంపై తమిళనాడు సర్కారుకు, కేంద్రానికి మధ్య రాజకీయ దుమారం రేగుతోంది.

కొత్త విద్యా విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో రెండు భారతీయ భాషలుండాలని కేంద్ర ప్రభుత్వం అంటుండగా.. హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు రాష్ట్రం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తిప్పికొట్టారు. విద్యార్థుల చదువుకునే హక్కును హరించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. విద్యా విధానాల అమలు విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎన్‌ఈపీ-2020లోని కీలక అంశాలను, ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్‌ (SSA) కింద అందించాల్సిన రూ.573 కోట్లను నిలిపేసింది.

నూతన జాతీయ విద్యావిధానం మార్గదర్శకాలను అమలు పరిస్తేనే కేంద్రం తన వాటా నిధులు అందిస్తుందని విధాన నిబంధనలు చెబుతున్నాయి. ఇలా కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం నడుస్తున్న వేళ నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి.

Tags

Next Story