Zomato, Swiggy: వర్షం పడితే అదనపు ఛార్జీలు.

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ తమ చందాదారులకు షాక్ ఇచ్చాయి. ఇకపై వర్షం పడుతుండగా ఫుడ్ డెలివరీ చేయాలంటే యూజర్స్ అదనంగా చార్జీలు చెల్లించాల్సిందేనని ప్రకటించాయి. ఇప్పటివరకు ప్రీమియం చందాదారులకు వర్తిస్తున్న రెయిన్ సర్‌చార్జ్ మినహాయింపును తొలగిస్తున్నట్టు జొమాటో, స్విగ్గీ తాజాగా ప్రకటించాయి. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమలు చేస్తున్నట్టు తమ యాప్ నోటిఫికేషన్‌లో ఓ సందేశాన్ని విడుదల చేశాయి. దీని ప్రకారం, ఇకపై స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్ చందాదారులు (ప్రీమియం సబ్‌స్ర్కైబర్స్) అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. స్విగ్గీ వన్ పేరుతో స్విగ్గీ, జొమాటో గోల్డ్ పేరుతో జొమాటో తన కస్టమర్లకు ప్రీమియం సేవలు అందిస్తున్నాయి.
వీటిని కొనుగోలు చేసిన వారికి రెండు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాల్ని కల్పిస్తున్నాయి. వాటిలో రెయిన్ సర్‌చార్జ్ మినహాయింపు కూడా ఒకటి. అయితే, తాజాగా ఈ సదుపాయాన్ని చందాదారులకు తొలగించాయి. భారీగా వర్షం పడే సమయంలో ఈ సర్‌చార్జ్ రూ.15 నుంచి రూ.30 వరకు విధించే అవకాశముంది. ఈ సంస్థలు ఇప్పటికే డెలివరీ ఫీజుకు అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో పనిచేసే తమ డెలివరీ పార్ట్‌నర్స్‌కు మంచి పారితోషికం అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జొమాటో, స్విగ్గీ పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com