Aditya L1: సూర్యుడి దిశగా ...

Aditya L1: సూర్యుడి దిశగా ...
ఐదోసారి విజయవంతంగా కక్ష్య పెంచిన శాస్త్రవేత్తలు

సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్‌ ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భూమికి బై బై చెప్పిన ఆదిత్య-ఎల్‌1 సూర్యుని దిశగా ప్రయాణం ప్రారంభించింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ కక్ష్యను పెంచి ఆదిత్యుని దిశగా ట్రాన్స్‌ లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఇస్రో పోస్ట్‌ చేసింది. భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇప్పటికే దాని కక్ష్యను నాలుగుసార్లు పెంచిన శాస్త్రవేత్తలు తాజాగా ఐదోసారి పెంచి సూర్యడి ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1 దిశగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో తెలిపింది.


ఇప్పుడు 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-ఎల్‌1ను మరొక విన్యాసంతో ఎల్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. కాగా, ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్‌ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో ఆదిత్య ఎల్‌1 తొలి లగ్రాంజ్‌ పాయింట్‌కు వెళ్తున్నది. భూమి, సూర్యుని మధ్య అటువంటి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక వస్తువును ఈ స్థలంలో ఉంచినట్లయితే, అది సులభంగా రెండింటి మధ్య స్థిరంగా ఉంటుంది. శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలుంటుంది. ఈ కేంద్రం నుంచే ఆదిత్య ఎల్‌1 సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది.

అంతకు కొన్ని గంటల ముందు ఆదిత్య-ఎల్1 శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది. మిషన్‌లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రా-థర్మల్, ఎనర్జిటిక్ ఐయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను కొలవడాన్ని ఆరంభించాయని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.


ఈ నెల 2 ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌ ద్వారా ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మరుసటి రోజే మొదటి కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. భారత్‌ తరఫున సూర్యుడి అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా వంటివాటి పరిశోధనకు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్పేస్ ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ మిషన్.

Tags

Next Story