Aditya L1:ఎగిసిపడే సౌర జ్వాల ను రికార్డ్ చేసిన ఆదిత్య-ఎల్‌1

Aditya L1:ఎగిసిపడే సౌర జ్వాల ను రికార్డ్ చేసిన  ఆదిత్య-ఎల్‌1
అధికశక్తి విస్ఫోటనాన్ని పసిగట్టిన హై-ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్

చంద్రయాన్ 3 సాధించిన విజయంతో ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. ఆ వెంటనే సూర్యుడి గురించి పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుడిపై సరికొత్త అధ్యయనాలను చేపట్టడానికి పంపించిన ఆదిత్య ఎల్1 తన పని మొదలుపెట్టింది. భూమి నుంచి బయల్దేరిన తర్వాత 120 రోజులకు సూర్యుడికి దగ్గరగా ఉండే లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ దిశగా ప్రయాణిస్తోంది. ఆ ఆదిత్య ఎల్ 1 మిషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఇప్పటికే భూ కక్ష్యను దాటి సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 లాగ్రాంజ్ పాయింట్ 1 వైపు మరింత చేరువ అయింది. దాన్ని పూర్తిగా చేరుకోవడానికి ఇంకో నెల రోజుల సమయం పట్టొచ్చు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో సూర్యుడిపై అధ్యయనాలను మొదలుపెడుతుంది. అయితే విజయవంతంగా నింగిలోకి అడుగుపెట్టిన ఆదిత్య ఎల్1 ఇటీవలే సోలార్ ఫ్లేర్స్ యొక్క హై ఎనర్జీ ఎక్స్-రే చిత్రాలను తీసింది. ఆదిత్య ఎల్1 బోర్డులోని 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్' (హెల్1ఓఎస్) సౌర జ్వాలను క్లిక్ చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సౌరశక్తి తీవ్రత అంటే.. సూర్యుడి నుంచి వెలువడే సౌర జ్వాలలు ఉవ్వెత్తున చెలరేగుతుంటాయని గుర్తించింది. ఈ సౌర జ్వాలలు కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతూ ఉంటాయని హై-ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ పసిగట్టింది. ఆ సౌర జ్వాల ఎగిసిపడటాన్ని కూడా రికార్డు చేసింది. ఇదే గరిష్ఠ సమయమని గుర్తించింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా సెకనులో పదోవంతు సమయంలోనే ఈ సౌరజ్వాల ఆకస్మికంగా ఎగసిపడుతున్నాయని.. తెలిపింది. అయితే దాన్ని లెక్కగట్టడం అసాధారణ చర్యగా ఇస్రో అంచనా వేసింది.

అయితే భూమి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత ఆదిత్య ఎల్1 అందించిన మొట్టమొదటి సంకేతం, సమాచారం ఇదే కావడం గమనార్హం. సౌర జ్వాల నుంచి 10 నిమిషాల వ్యవధిలో కొన్ని వందల ఎర్గ్‌ల శక్తి విడుదల అవుతుందని ఇస్రో పేర్కొంది. రేడియో, ఆప్టికల్, అల్ట్రా వైలెట్, ఎక్స్-రే, హార్డ్ ఎక్స్ రే, గామా కిరణాలను విడుదల చేస్తుందని తెలిపింది. అయితే అలాంటి వాటిని గుర్తించేలా ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్ పేలోడ్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story