Aditya L1 : విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి..

సూర్యుడికి సంబంధించి లోతైన అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సిద్ధమైంది. ఈ మేరకు ఆదిత్య-ఎల్1ను మోసుకుని PSLV-C57 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం సాగుతోంది. ఆదిత్య-ఎల్1 గమనాన్ని షార్ నుంచి శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. PSLV- C57 రాకెట్ నుంచి ఆదిత్య ఎల్1 విజయవంతంగా విడిపోయిందని.. దానిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఇక ఈరోజు సరిగ్గా 24 గంటల తర్వాత ఆదివారం ఉదయం 11:45 నిమిషాలకు మొదటి కక్ష్య పెంపు జరగనుంది.
ఆదిత్య-ఎల్1 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’ -లగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ మిషన్‌ను చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఆదిత్య ఎల్-1లో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి శోధిస్తాయి.
తొలుత ఆదిత్య-ఎల్1ను PSLVరాకెట్.. భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. ఆదిత్య-ఎల్1లోని రాకెట్లను ఇందుకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎల్1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం-SOI ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం ఎల్1 బిందువును చేరుకుంటుంది.
ఆదిత్య-ఎల్1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. అందులోని ప్రధాన సాధనమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్- VELC రోజుకు 14 వందల 40 చిత్రాలను పంపుతుంది. VELC బరువు 190 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. అది ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఇంధన వినియోగ తీరునుబట్టి అది మరింత ఎక్కువకాలం పనిచేసే అవకాశం ఉంది. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్ , ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ 'లోఎనర్జీ' ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్ -1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ మిగతా ఆరు పేలోడ్‌లు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్ లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ , మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్ , క్రోమోస్పియర్ , వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com