Isro : అది చంద్రయానం .. ఇక సౌర యాగం

Isro : అది  చంద్రయానం .. ఇక సౌర యాగం

చంద్రయాన్‌-3 మిషన్‌ ద్వారా ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా దించి చరిత్ర సృష్టించిన ఇస్రో....మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. భానుడి రహస్యాలను కనుగొనేందుకు సెప్టెంబరు-2న ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేశారు. ఇప్పటికే ఈ ఉపగ్రహం శ్రీహరికోటకు చేరుకున్నట్లు సమాచారం.

జాబిల్లి దక్షిణధ్రువంపై చంద్రయాన్‌-3ని విజయవంతంగా దించి అంతరిక్ష రంగంలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 2న ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక. ఆదిత్య-ఎల్‌ 1ను నింగిలోకి తీసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. 1500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమి నుంచి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్‌ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుంటుందని ఇస్రో తెలిపింది.


ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌, మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్‌-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయని ఇస్రో తెలిపింది. మిగతా మూడు సాధనాలు....సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story