Aditya-L1 Mission: విజయవంతంగా కక్ష్య పెంపు

Aditya-L1 Mission: విజయవంతంగా కక్ష్య పెంపు
రెండోసారి కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో... అంతా అనుకున్న ప్రకారమే జరుగుతుందని వెల్లడి...

ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1 Mission) ఉపగ్రహాన్ని నిర్దేశిత భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో (ISRO) ఇవాళ రెండోసారి కక్ష్య పెంపు ప్రక్రియ నిర్వహించింది. ప్రస్తుతం 282×40225 కి.మీ. కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టినట్లు ట్వీట్‌ చేసింది. ఆ సమయంలో ఉపగ్రహాన్ని మారిషస్‌, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్ల నుంచి ట్రాక్‌ చేసినట్లు పేర్కొంది. ఇస్రో ఆదివారం తొలి కక్ష్య పెంపు ప్రక్రియను నిర్వహించింది. సెప్టెంబరు 10 వేకువజామున 2:30 గంటలకు తదుపరి విన్యాసం నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.


సూర్యుడికి సంబంధించి లోతైన అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సెప్టెంబర్‌ 2వ తేదీన ఆదిత్య ఎల్‌1 ప్రయోగాన్ని చేపట్టింది. ఆదిత్య-ఎల్‌1ను మోసుకుని PSLV-C57 రాకెట్‌ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం విజయవంతంగా సాగుతోంది. ఆదిత్య-ఎల్‌1 గమనాన్ని షార్‌ నుంచి శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. PSLV- C57 రాకెట్‌ నుంచి ఆదిత్య ఎల్‌1 విజయవంతంగా విడిపోయిందని.. దానిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆదివారం ఉదయం 11:45 నిమిషాలకు మొదటి కక్ష్య పెంపును కూడా విజయవంతంగా నిర్వహించారు.


ఆదిత్య-ఎల్‌1 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ -లగ్రాంజ్‌ పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ మిషన్‌ను చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఆదిత్య ఎల్‌-1లో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి శోధిస్తాయి.

తొలుత ఆదిత్య-ఎల్‌1ను PSLVరాకెట్‌ను ఇస్రో భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపడం ప్రారంభించింది. ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను ఇందుకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎల్‌1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం-SOI ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్‌ దశ ప్రారంభమవుతుంది. ఇలా 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం ఎల్‌1 బిందువును చేరుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story