ISRO: సెప్టెంబరు 2న నింగిలోకి ఆదిత్య ఎల్-1

చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి.. యావత్ ప్రపంచం చేత నీరాజనాలు అందుకున్న ఇస్రో.. ఇప్పుడు సూర్యుడిపై దృష్టి పెట్టింది. ఆదిత్యుడిలోని అంతుబట్టని రహస్యాలను తెలుసుకోవటానికి నడుంకట్టింది. ఈ మేరకు సెప్టెంబరు 2వ తేదీ ఉదయం 11 గం. 50 ని.లకు పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి ప్రయోగించనుంది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రేంజ్ పాయింట్ 1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించొచ్చు.
సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేయడానికి ఆదిత్యలో ఏడు సైన్స్ పరికరాలు ఉన్నాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని పరిశీలిస్తాయి. మిగతా మూడు సాధనాలు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. ఇస్రో ఇప్పటి వరకూ చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగాల్లో ఇదొకటి. నిజానికి, ఇది ఉపగ్రహమూ కాదు వ్యోమనౌక కూడా కాదు! ఇది ఒక అంతరిక్ష ప్రయోగశాల! ఇందులో టెలిస్కోపులు, మ్యాగ్నెటోమీటర్లు, స్పెకోట్రమీటర్లు, ప్లాస్మా ఎనలైజర్లు వంటి పరికరాలు ఉంటాయి. వీటి సాయంతో సూర్యుడిలో సంభవించే మార్పులను, వాటి తాలూకు సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తుంది.
ఆదిత్య ఎల్-1కు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే ఉత్తేజిత కణాలపై ఒక కన్నేసిఉంచటం స్వల్పకాలిక లక్ష్యం. ఈ రేడియేషన్‌ను శాస్త్రీయ పరిభాషలో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు. ఇది ఒక సునామీలాగా విరుచుకుపడితే రోదసిలోని మన ఉపగ్రహాలు, ఇతర పరిశోధన సామగ్రి ధ్వంసమవుతుంది. అంతరిక్షంలో భారత్‌కు ప్రస్తుతం దాదాపు రూ.50వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని సూర్యుడి రేడియేషన్ నుంచి కాపాడుకోవటం అవసరం. ఈ మేరకు ఆదిత్య ఎల్-1 ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారాన్ని అందిస్తుంది.
ఇక దీర్ఘకాలిక లక్ష్యం విషయానికొస్తే.. సూర్యుడికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవటం, మానవాళికి ఉన్న విజ్ఞానాన్ని మరింత పెంచటం. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత ధార్మికత భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనూ సూర్యుడిపై పరిశోధనలు మానవాళికి అత్యవసరం. ఆదిత్య ఎల్-1 ఈ అంశాలపై దృష్టి పెట్టి పని చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com