Myanmar-Rakhine: రఖైన్ రాష్ట్రంలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక

మయన్మార్‌లోని (Myanmar) రాఖైన్ (Rakhine) రాష్ట్రంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా అక్కడకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్రం సూచించింది. అలాగే, ప్రస్తుతం అక్కడ ఎవరైనా భారతీయులు ఉంటే తక్షణమే బయలుదేరి రావాలని పేర్కొంది. రాఖైన్‌లో హింస చెలరేగుతోన్న నేపథ్యంలో తొలిసారి భారత్ సూచనలు చేసింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, నిత్యావసరాల కొరత సహా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, భారతీయులకు అక్కడకు వెళ్లొద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఎవరైనా ఉంటే తక్షణమే ఆ రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని భారతీయులను కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక అడ్వైజరీని విడుదల చేసింది.
కాగా మయన్మార్‌లో ఫిబ్రవరి 1, 2021న సైనిక ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ తీవ్రస్థాయిలో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. రఖైన్ రాష్ట్రంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో గతేడాది అక్టోబర్ నుంచి సాయుధ జాతి సమూహాలు, మయన్మార్ మిలిటరీ మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఫలితంగా అక్కడ హింసాకాండ నెలకొంది. ఈ హింస గతేడాది నవంబర్ నాటికి కీలకమైన మయన్మార్ పట్టణాలతో పాటు భారతదేశ సరిహద్దు సమీప ప్రాంతాలకు విస్తరించాయి. మయన్మార్ సైన్యం తన ప్రత్యర్థులు, సైనిక పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ పరిణామం మణిపూర్, మిజోరాం రాష్ట్రాలలో శాంతిభద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. అందుకే ఈ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా భారత్‌కు మయన్మార్ వ్యూహాత్మక పొరుగు దేశాలలో ఒకటిగా ఉంది.
మన దేశ ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇదివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా కూడా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండానే ప్రజలు వెళ్లే అవకాశం ఉండేది. కానీ మయన్మార్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఘటనలు పెరిగిపోయాయి. వీటిని నివారించేందుకు ఆ దేశ సరిహద్దు వెంట కంచె వేస్తామని గత నెలలోనే అమిత్ షా అన్నారు. మయన్మార్‌లో హింసను పూర్తిగా నిలిపివేయాలని కోరిన భారత్.. సమ్మిళిత సమాఖ్య ప్రజాస్వామ్యం పరివర్తనకు పిలుపునిచ్చింది. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక పొరుగుదేశం మయన్మార్‌లో పరిస్థితి క్షీణించడంపై మేము ఆందోళన చెందుతున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com