African cheeta : చీతాల మధ్య ఆధిపత్య పోరు

African cheeta : చీతాల మధ్య ఆధిపత్య పోరు
మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్ లో గాయపడ్డ ఆఫ్రికన్ చీతా అగ్ని

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కు సంరక్షణలో ఉన్న చీతాల మధ్య ఘర్షణ జరిగి, ఓ మగ చీతా తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం గాయపడిన అగ్ని చీతాకు చికిత్స కొనసాగుతోందని, అది కోలుకుంటోందని ప్రకటించారు.

కునో నేషనల్ పార్కు లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. రెండు గ్రూపుల చీతాల మధ్య జరిగిన పోరాటంలో ఆఫ్రికన్ చీతా అగ్ని గాయపడింది. గత ఏడాది ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి తెప్పించిన 5 ఆడ, 3 మగ చీతాలలో ఇది ఒకటి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే జంతువులుగా పేరుగాంచిన చీతాలు భారత్‌లో ఎప్పుడో అంతరించిపోయాయి. వీటిని మళ్లీ దేశంలో తిరిగేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం అనేక ఏళ్ల నుంచి చేసిన ప్రయత్నం గతేడాది కొలిక్కి వచ్చింది. నమీబియా నుంచి 8 చిరుతలను, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం రోజున కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. అనంతరం మరో 12 చిరుతలను ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. అయితే వీటిని స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం ఘర్షణలు పడుతున్నాయి.

నిజానికి ఈ రెండు దేశాల చిరుతలను వేర్వేరు దిశలలో వదిలి పెట్టారు. అయినప్పటికీ ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి. తాజాగా సౌత్‌ ఆఫ్రికాకు చెందిన వాయు, అగ్ని చీతాలతో నమీబియాకు చెందిన శౌర్య, గౌరవ్‌ లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్‌ ఆఫ్రికాకు చెందిన అగ్ని తీవ్ర గాయాలపాలయ్యింది. చిరుతలని మానిటరింగ్‌ చేస్తున్న ఓ టీమ్‌ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన అగ్నికి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.ప్రస్తుతానికి దాని ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అన్నట్టు శౌర్య, గౌరవ్‌ చిరుతలు కవలలు. అవి భారత్‌కు వచ్చినప్పటి నుంచి ఒకదానితో ఒకటి కలిసే ఉంటున్నాయి. ఇక సౌత్‌ ఆఫ్రికా నుంచి తెచ్చిన వాయు, అగ్ని చీతాలు వేర్వేరు కుటుంబాలకు చెందినవిగా అధికారులు చెబుతున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం అడవులలో జరిగినట్టుగానే అప్పుడప్పుడు పోరాటాలు జరుగుతాయి. అయితే ఇంత గాయపడటం ఇదే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story