Haryana couple: మగ బిడ్డ కోసం ఆరాటం..10 మంది కుమార్తెల తర్వాత కుమారుడు

కుమారుడు కావాలనే బలమైన కోరిక ఆ దంపతులను 11వ ప్రసవం వరకు తీసుకెళ్లింది. 19 ఏళ్ల వైవాహిక జీవితం, పది మంది కుమార్తెల తర్వాత హర్యానాకు చెందిన దంపతులు ఎట్టకేలకు మగబిడ్డకు జన్మనిచ్చారు. జింద్ జిల్లా ఉచానా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అరుదైన ప్రసవం జరిగింది.
ఫతేహాబాద్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల మహిళ జనవరి 3న ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే పదిసార్లు ప్రసవం కావడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి, ఈ 11వ ప్రసవం అత్యంత ప్రమాదకరంగా మారిందని వైద్యుడు నర్వీర్ షియోరాన్ తెలిపారు. ప్రసవ సమయంలో ఆమెకు మూడు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని, ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
మగబిడ్డ పుట్టడంతో ఆ పది మంది అక్కల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ తమ్ముడికి వారు 'దిల్‌ఖుష్' అని పేరు పెట్టుకున్నారు. తండ్రి సంజయ్ కుమార్ రోజువారీ కూలీగా పనిచేస్తూ తన 10 మంది కుమార్తెలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తెలు ఇంకా బడికి వెళ్లే వయసులో ఉన్నారు. తన పది మంది కుమార్తెల పేర్లను వరుసగా గుర్తుకు తెచ్చుకోవడానికి తండ్రి ఇబ్బంది పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుమార్తెలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెబుతున్నప్పటికీ, కుమారుడు కూడా ఉండాలనే ఆకాంక్షతో మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడంపై సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో లింగ నిష్పత్తి 2025 నాటికి 1000 మంది పురుషులకు 923 మహిళలకు మెరుగుపడినప్పటికీ, ఇప్పటికీ జాతీయ సగటు కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. కుమారుడి కోసం వరుస ప్రసవాలు చేయడం తల్లి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

