Ayodhya Ram Temple: అయోధ్య లో మరో 13 ఆలయాల నిర్మాణానికి భారీ ప్రణాళికలు

దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, అనేక ఉద్యమాలు, నిరసనలు, న్యాయ పోరాటాల అనంతరం.. ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల కల సాకారం అయింది. అయితే ప్రస్తుతం అయోధ్యలో బాలక్ రామ్ మందిర్ నిర్మాణం పూర్తి కాలేదు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం మాత్రమే జరగ్గా.. ఇంకా పై అంతస్థుల్లో పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఈ బాలక్ రామ్ మందిర్ మాత్రమే కాకుండా మరో 13 ఆలయాలు నిర్మించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా వెల్లడించింది. వాటి కోసం భారీ ప్రణాళిక కూడా చేసినట్లు స్పష్టం చేసింది.
అయోధ్యలో కేవలం బాలక్ రాముడి ఆలయమే కాకుండా మరో 13 ప్రధాన ఆలయాల నిర్మిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ తాజాగా మీడియాకు వెల్లడించారు. ఇందు కోసం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ 13 ప్రధాన మందిరాల్లో 6 దేవాలయాలను అయోధ్య రామమందిరం లోపల నిర్మించనున్నట్లు చెప్పారు. మిగిలిన 7 దేవాలయాలను అయోధ్య ఆలయ బయట ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆ 13 ఆలయాల నిర్మాణాలకు సంబంధించిన పనులు.. ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్టు స్వామి గురుదేవ్ గిరీజీ చెప్పారు.
అయోధ్య రామాలయ సముదాయం వెలుపల, భారీ ప్రదేశంలో మరో ఏడు దేవాలయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీటిని రాముడి జీవితంలో పాలు పంచుకున్న వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. "ఇవి సాధువులైన వాల్మీకి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, శబరి, రాముడి కోసం తన ప్రాణాలను అర్పించిన పక్షి జటాయువు కోసం నిర్మిస్తున్నాం అని చెప్పారు.
అయోధ్యలో నిర్మితమైన దివ్య, భవ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన నూతన రామ్‌లల్లా విగ్రహానికి ‘బాలక్ రామ్’గా నామకరణం చేశారు. ఈ విగ్రహంలో రాముడు ఐదేళ్ల బాలుడిని పోలి ఉండటమే దీనికి కారణమని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు 50-60 విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠలు నిర్వహించానని, వాటన్నింటిలోకీ ఇదే తనకు అత్యంత అలౌకిక ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. కాగా, రామాయణం, రామచరిత్ మానస్ లాంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే బాల రాముడి విగ్రహానికి ఆభరణాలను సిద్ధం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com