NASA-ISRO's NISAR mission: ఇస్రో-నాసా భాగస్వామ్యం సక్సెస్… వచ్చే ఏడాది ప్రయోగం

వాతావరణ మార్పులపై అధ్యయనానికి భారత్-అమెరికా సంయుక్తంగా చేపట్టిన మిషన్ చివరి దశలో ఉందని నాసా ప్రకటించింది. ఈ ప్రయోగం వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో నిర్వహించనున్నామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ మిషన్ ఇదే కావడం గమనార్హం. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డైరెక్టర్ లారీ లెషిన్ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్వూలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 సహా పలు అంశాలపై మాట్లాడారు.
నిసార్ మిషన్‌పై స్పందిస్తూ.. వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి భూమి ఉపరితలం ఎలా మారుతుందో అవగాహన చాలా ముఖ్యమన్నారు. ఉపరితలంలో చిన్న చిన్న మార్పులను నిసార్ ద్వారా అర్థం చేసుకోవచ్చని.. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే మంచు ఫలకలు కరగడం, అడవులు, చిత్తడినేలలు, భూకంపాలు, అగ్నిపర్వతాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. భూ ఉపరితలంపై జరిగే మార్పులను వీక్షించడం ద్వారా శాస్త్రవేత్తలు మార్పుల వెనుక ఉన్న భౌతికతను అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఏం జరుగుబోతుందో అంచనా చేయవచ్చని పేర్కొన్నారు. నిసార్‌పై ఇస్రో, నాసా కలిసి పని చేస్తుండడంపై స్పందిస్తూ.. అంతరిక్ష పరిశోధన చరిత్రలో అతిపెద్ద సహకారమన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సహకారం, చర్చలపై ఉన్నత స్థాయి నాయకత్వం చూసుకుంటుందన్న ఆమె.. 30-40 మంది ఇంజినీర్లు బెంగళూరులో ఇస్రో సహోద్యోగులతో తొమ్మిది నెలలుగా కలిసి పని చేస్తున్నామన్నారు. ఇది ఎంతో ఉత్సాహకరంగా ఉందన్నారు. అద్భుతమైన సహకారం, మంచి టీమ్‌వర్క్‌తో పాటు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, బృందం చాలా బాగా కలిసి పని చేస్తోందన్నారు.
భూకంపాలు, సునామీల వంటి ప్రమాదాలను అంచనా వేయడంలో NASA-ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) కూడా సహాయపడుతుంది.. చంద్రయాన్-3 తర్వాత భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల గౌరవం మరింత పెరిగింది’ అని ఆయన అన్నారు. NISAR అనేది ISRO, NASA సంయుక్తంగా అభివృద్ధి చేసిన తక్కువ భూ కక్ష్య అబ్జర్వేటరీ శాటిలైట్. ఇది మొత్తం భూమిని 12 రోజుల్లో మ్యాప్ చేస్తుంది. భూగ్రహం పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భజల స్థాయిలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం సహా.సహజ ప్రమాదాలలో మార్పులను అర్థం చేసుకోవడానికి స్థిరమైన డేటాను అందిస్తుంది.
కాలిఫోర్నియాలోని నాసా జేపీఎల్ రాడార్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేశారు. దానిని అంతరిక్ష నౌకతో జత చేయడానికి బెంగళూరుకు తీసుకొచ్చారు. మొత్తంగా ఇరు శాస్త్రవేత్తల బృందాలు అద్భుతంగా కలిసి పనిచేశాయి అని లెషిన్ నొక్కిచెప్పారు. అంతేకాదు, భారత అంతరిక్ష కార్యక్రమాలపై మాకు ఎంతో గౌరవం ఉందని, చంద్రయాన్-3 విజయం తర్వాత అది మరింత పెరిగిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com