Lalu Prasad Yadav: లాలూ కుటుంబాని అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌లను తమ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లో ఉన్న బంగ్లాలో రబ్రీ దేవి గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆర్జేడీ పార్టీ కీలక సమావేశాలు, కార్యకలాపాలకు ఇదే కేంద్రంగా ఉండేది. ఇప్పుడు ఈ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. అదేవిధంగా, లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కూడా ఆయన నివాసముంటున్న బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ బంగ్లాను కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లకేంద్ర కుమార్ రోషన్‌కు కేటాయించినట్లు సమాచారం.
ఈ నోటీసులపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. నితీశ్ కుమార్ లాలూ కుటుంబాన్ని అవమానించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. బంగ్లా నుంచి పంపగలరేమో కానీ, బిహార్ ప్రజల గుండెల్లోంచి లాలూను తొలగించలేరని పేర్కొన్నారు. ఆర్జేడీ నేతలు దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు.
అయితే, ప్రభుత్వ వర్గాలు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నామని భవన నిర్మాణ శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. బిహార్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న రబ్రీ దేవి హోదాకు అనుగుణంగా, హార్డింగ్ రోడ్‌లో మరో బంగ్లాను కేటాయించినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పరాజయం, కుటుంబ వివాదాలతో సతమతమవుతున్న లాలూ ఫ్యామిలీకి ఈ బంగ్లాల వివాదం మరింత తలనొప్పిగా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

